నందిపేట, వెలుగు: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేండ్లపాటు అవినీతిరహిత పాలన అందిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి అధ్యక్షతన నందిపేటలో నిర్వహించిన మండల సర్యసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్ విఠల్‌రావుతో కలిసి హాజరయ్యారు. ప్రోగ్రామ్‌లో ముందుగా ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.
ట్రాన్స్‌కో అధికారులు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొండూర్ సర్పంచ్ సభా దృష్టికి తీసుకురాగా, పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పైరవీలకు తావులేదన్నారు. నందిపేటను మున్సిపాలిటీ చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
జడ్పీ చైర్మన్ విఠల్‌రావు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సర్పంచులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ఆనంద్, ఎంపీడీవో నాగవర్ధన్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.