- ములుగు ఎస్పీ గౌస్ ఆలం
- మేడారంలో ప్లాస్టిక్‌ను వినియోగించొద్దు
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ గౌస్ ఆలం చెప్పారు. మేడారం జాతరకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై శనివారం ములుగులో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
జాతరకు వచ్చే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్‌కుమార్, ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీలు సుభాష్‌బాబు, రవీందర్, సీఐలు రాజు, రంజిత్, శంకర్, కిరణ్, రోహిత్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్‌ను వినియోగించొద్దు
ములుగు, వెలుగు : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలో భక్తులు ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్లాస్టిక్‌ను వినియోగించొద్దంటూ వినియోగదారుల మండలి జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవ సమాజ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరిగి అనేక నష్టాలు కలుగుతాయన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఏవో ప్రసాద్, వినియోగదారుల మండలి సభ్యులు సంగ రంజిత్, గోరంట్ల ఓంకార్, దుర్గం సూరయ్య, చుంచు రమేశ్ పాల్గొన్నారు.