
- ఆర్మూర్లో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
- వార్డుల్లో 15 రోజులకోసారి పర్యటిస్తా
ఆర్మూర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 4, 13, 24, 26, 27, 33, 35 వార్డుల్లో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి పర్యటించారు. ఆయా వార్డుల్లో సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో ప్రతి 15 రోజులకోసారి పర్యటిస్తానని చెప్పారు. మామిడిపల్లి లో ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి పార్కుగా మార్చాలని చెప్పారు. పది శాతం స్థలాలను కాపాడుకునే బాధ్యత కాలనీవాసులదేనని అన్నారు. మున్సిపల్ పరిధిలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నందున నిధులను సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఉపయోగించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 మంచి నీటి పథకం ద్వారా హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పెర్కిట్ చెరువులో గతంలో ఏర్పాటుచేసిన కరెంటు స్తంభాలను చోరీకి గురైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్చైర్మన్ కంచెట్టి గంగాధర్, సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, బీజేపీ జిల్లా నాయకులు కలిగోట గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.