
బ్యాంకాక్: మయన్మార్ సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూపు అధీనంలో ఉన్న గ్రామంపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..20 మందికి పైగా గాయపడ్డారని స్థానిక స్వచ్ఛంద సంస్థ అధికారులు తెలిపారు.
పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై జరిగిన దాడుల్లో వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సర్వీసులను నిలిపేశారు.
మయన్మార్ సైన్యం 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని సైన్యం అణచివేస్తోంది.
భారీ ఎత్తున వైమానిక దాడులకు తెగబడుతోంది. శాంతియుత ప్రదర్శనల్ని అణచివేసేందుకు సైన్యం ప్రయత్నిస్తుండటంతో అనేక మంది ఆయుధాలు చేతబట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.