గండిపేట్, వెలుగు: ప్రమాదవశాత్తూ నాలుగో ఫ్లోర్ నుంచి పడి ఆర్మీ కెప్టెన్ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఎంసీ సర్వీస్ కింద శంకర్ రాజ్‌కుమార్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి లక్నో నుంచి అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని తన ఇంటికి వచ్చాడు. ఈ నెల 2న మధ్యాహ్నం నాలుగో అంతస్తులోని తన ఇంటి బాల్కనీలో నిలబడి ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. పెద్ద శబ్ధం రావడంతో భార్య, పని మనిషి బయటకు వచ్చి చూడగా, శంకర్ రాజ్‌కుమార్ గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్థానికుల సాయంతో బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.