- లేఖ రాసి వేర్వేరు చోట్ల ఆర్మీ జంట సూసైడ్
న్యూఢిల్లీ: మిలటరీ దళాల్లో ఉన్నత పదవులు సాధించారు. ఆపై ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ, ఆ జంట వేర్వేరు చోట్ల ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఆగ్రాలో తాను ఉంటున్న గదిలో ఉరేసుకోగా, ఆయన భార్య ఢిల్లీలోని ఆర్మీ కంటోన్మెంట్ గెస్ట్‌హౌస్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మృతదేహంతో కలిపి తనకు దహన సంస్కారాలు నిర్వహించాలంటూ ఆమె సూసైడ్ నోట్ లో కోరారు. ఈ నెల14న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు.
భర్త సూసైడ్ తట్టుకోలేక భార్య..
బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన దీన్ దయాళ్ దీప్(32) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఖేరియా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో విధుల్లో ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన భార్య రేణు తన్వర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లిద్దరూ ఆగ్రాలోని మిలటరీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు.
మంగళవారం ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకున్న తర్వాత దీప్ తన క్వార్టర్స్‌లోకి వెళ్లారు. మరుసటి రోజు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో డోర్స్ పగలగొట్టి చూడగా దీప్ ఉరికి వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. అదేరోజు ఆయన భార్య ఆర్మీ కంటోన్మెంట్‌లోని గెస్ట్‌హౌస్‌లో ఉరేసుకున్నారు.
భర్తతో కలిపి తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని అక్కడ దొరికిన సూసైడ్ నోట్లో తన్వర్ పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దీప్ గదిలో మాత్రం ఎలాంటి నోట్ లభించలేదని చెప్పారు. ఇద్దరూ కూడా తమ మరణాలకు ముందురోజు వరకూ అందరితో కలివిడిగానే ఉన్నారని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. రెండు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భర్త సూసైడ్ చేసుకున్నారని తెలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.