మా పేరెంట్స్‌‌కు సంక్షేమ పథకాలు ఇవ్వండి

మా పేరెంట్స్‌‌కు సంక్షేమ పథకాలు ఇవ్వండి
  • ఆఫీసర్లకు హనుమకొండ జిల్లా కొత్తపల్లి ఆర్మీ ఉద్యోగుల రిక్వెస్ట్

భీమదేవరపల్లి, వెలుగు : దేశ రక్షణ కోసం ఆర్మీలో పని చేస్తున్నామని.. తమ తల్లిదండ్రులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఆర్మీ ఉద్యోగులు కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగులు బుధవారం తహసీల్దార్‌‌, ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఆర్మీలో పని చేస్తున్నందున.. తమ తల్లిదండ్రులకు రేషన్‌‌ కార్డులు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ, మిగతా పథకాలు సైతం వర్తింపజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

తాము ఉద్యోగ రీత్యా కుటుంబాలకు దూరంగా ఉంటుండడం వల్ల పేరెంట్స్‌‌ను చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను తమ తల్లిదండ్రులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ ఉద్యోగం కారణంగా పేరెంట్స్‌‌కు అన్యాయం చేయొద్దంటూ  తహసీల్దార్‌‌ ప్రవీణ్‌‌, ఎంపీడీవో వీరేశంకు వినతిపత్రాలు అందజేశారు. ఆర్మీ ఉద్యోగులు ఎర్రగొల్ల కుమారస్వామి, ఎట్టేపు రాజు, మ్యాకల రజనీకాంత్, బోనాల రాజు, ఎర్రగొల్ల తిరుపతి, పున్నం శ్రీధర్, పుట్ట రాజు తదితరులు ఉన్నారు.