చీతా హెలికాప్టర్​ కూలిన ప్రమాదంలో యాదాద్రి జిల్లా వాసి వినయ్​భాను రెడ్డి మృతి

  • వినయ్​ది యాదాద్రి జిల్లా బొమ్మలరామారం
  • ప్రమాదంలో పైలట్​ మేజర్ జయంత్ దుర్మరణం


యాదాద్రి, వెలుగు: ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్​ కూలిన ప్రమాదంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్ట్​నెంట్ కర్నల్ ​వినయ్​భాను రెడ్డి మృతిచెందారు. గురువారం ఉదయం అరుణాచల్​ప్రదేశ్​లో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పైలట్ మేజర్ ఏ జయంత్ కూడా చనిపోయినట్లు డిఫెన్స్​మినిస్ట్రీ వెల్లడించింది. ఉదయం 9 గంటలకు కమెంగ్ జిల్లా సంగే గ్రామం నుంచి అస్సాంలోని సోనిత్​పూర్ జిల్లా మిస్సమారికి హెలికాప్టర్ లో లెఫ్ట్​నెంట్ కర్నల్​వినయ్​భాను రెడ్డి, మేజన్​జయంత్ బయల్దేరారు. 9.15 గంటలకు వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో కనెక్షన్​కోల్పోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పశ్చిమ కమెంగ్ జిల్లాలోని బోమ్‌‌‌‌డిలాకు పశ్చిమాన ఉన్న మండలా సమీపంలో కూలిపోయినట్లు గుర్తించామన్నారు. ఆ ఏరియాలో మొబైల్​ కనెక్టివిటీ ఉండదని, పొగమంచు కారణంగా కేవలం 5 మీటర్ల దూరం మాత్రమే కనిపిస్తుందని, సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని వివరించారు. దిరాంగ్ ఏరియాలో హెలికాప్టర్ కూలినట్లు బంగ్జాలేప్ గ్రామస్థులు సమాచారం ఇచ్చారని మండలా పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా హెలికాప్టర్ నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయని, పొగ వస్తుండటంతో ఘటనాస్థలాన్ని గుర్తించామని తెలిపారు.

బొమ్మల రామారంలో విషాదం

లెఫ్ట్​నెంట్ కర్నల్​ఉప్పల వినయ్ భాను రెడ్డి (37) మృతితో బొమ్మల రామారం గ్రామంలో విషాదం నెలకొంది. సైన్యంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగిన తమ గ్రామవాసి హెలికాప్టర్ ప్రమాదంతో కన్నమూయడంపై స్నేహితులు, గ్రామస్థులు కంటనీరు పెట్టారు. వినయ్​భాను రెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ మల్కాజిగిరి లో ఉంటున్నది. ఆయన తండ్రి ఉప్పల నరసింహారెడ్డి లయన్స్ క్లబ్​సేవా కార్యక్రమాల ద్వారా మండలంలో అందరికి సుపరిచితుడు.