ఆ ఊరు సైనిక గ్రామం : దేశ రక్షణ కోసం ఇంటికో సిపాయి

కష్టపడితే ఎంచుకున్న రంగంలో సక్సెస్​ అవ్వొచ్చు అనడానికి ఈ గ్రామమే ఒక ఉదాహరణ. జనాభా 4199.. బస్సు రూటు కూడా సరిగ్గా ఉండదు.. సరైన గ్రౌండ్​ లేని గవర్నమెంట్​ స్కూల్​..  అయినా, ఇక్కడి యువతకు ఒక  బలమైన లక్ష్యం ఉంది. అదే  వాళ్లను సైనికులుగా మార్చుతోంది.

భీమదేవరపల్లి, వెలుగు : ఒకప్పుడు ఆ ఊరు పేరు చెబితే నక్సలైట్లు గుర్తొచ్చేవాళ్లు. కొంగల సుధాకర్​రెడ్డి, మాసాల రవీందర్​, గజ్జి సంపత్​, బర్మ చేరాలుతో పాటు గ్రామానికి చెందిన చాలా మంది యువకులు మావోయిస్ట్​ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ల బాటలో ఇంకొంత మంది అడవులకు పోయారు. అలాంటి పరిస్థితుల నుంచి నేడు ఇంటికొక్క సైనికుడు తయారయ్యారు. ఇప్పటికే 35 మంది ఆర్మీలో చేరగా.. మరో 20 మంది మొదటి దశలో ఎంపికయ్యారు. ఆ ఊరు పేరే ఉమ్మడి కరీంనగర్​ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి. ప్రస్తుతం వరంగల్​ అర్బన్​ జిల్లాలోకి మారింది.

దేశ సేవలో ఇంటికొక్కరు..

ఆర్మీ, సీఆర్పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటీబీటీ పోలీస్​ తదితర రంగాల్లో కొత్తపల్లి గ్రామం నుంచి 35 మంది జమ్మూ కశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, రాజస్థాన్​, పశ్చిమ బంగ్లా,  కర్ణాటక, తమిళనాడుతో పాటు హైదరాబాద్​లో సేవలందిస్తున్నారు. మరో ఆరుగురు శిక్షణలో ఉన్నారు.  మొదటిసారి గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల రాజయ్య కొడుకులు రాజు, కుమారస్వామి, తిరుపతి ఆర్మీలో చేరారు. వారి ప్రేరణతో ఆడెపు చందు కష్టపడి సైన్యంలో చేరాడు. ఆ తర్వాత జీవన్​, వేణు, రాజు, ప్రవీణ్​ శెట్టి రాజు, విజయ్​, సురేశ్​, రజనీకాంత్​, శ్రీను, శ్రీకాంత్​, హారిక.. ఇలా ఇంటికొక్కరు ఆర్మీకి ఎంపికయ్యారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే..

ప్రస్తుతం ఆర్మీలో చేస్తున్న కొత్తపల్లి యువకులు దాదాపు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వాళ్లే. అంతేకాదు ప్రస్తుతం ఉన్న యువకులు పాఠశాలలో సరిపడా గ్రౌండ్​ లేకున్నా.. గ్రామం బయట పడావు భూముల్లో రన్నింగ్​ ట్రాక్​ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత సీనియర్ల సలహాలు, సూచనలతో ఫిట్​నెస్​, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

ఎంత కష్టమైనా..

‘ఆర్మీ సెలక్షన్స్​ ఎంత కఠినంగా ఉంటాయో.. విధుల్లో కూడా అంతే సవాళ్లు ఉంటాయ’ని  ఆడెపు చంద్రశేఖర్​ చెప్పారు. ‘రాజస్థాన్​, అస్సోం, ఉత్తరప్రదేశ్​ కంటే హిమాచల్​ప్రదేశ్ డ్యూటీ కష్టంగా ఉంటుంది. రోజుల తరబడి అక్కడి మంచు కొండల్లో విధులు నిర్వర్తించాలి’ అన్నారు. ‘దేశ ప్రజల కోసం మేము తిండి గింజలు పండిస్తున్నం. మా కొడుకు సైన్యంలో చేరి దేశానికి రక్షణగా ఉండటం మాకు గర్వంగా ఉందని’ మేకల విజయ్​ తల్లిదండ్రులు సమ్మయ్య, రాజమణి చెప్పారు. ‘సరైన బస్సు సౌకర్యం లేని మా గ్రామానికి ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ సహకారంతో బస్సులు వస్తున్నయ్. మా వాళ్లల్లో చాలా మంది ఆర్మీలో చేరడమే కాదు.. వాళ్లంతా గ్రామాభివృద్ధికి ముందుకొస్తున్నారని’ గ్రామస్తులు చెబుతున్నారు.