మయన్మార్‌‌‌‌‌‌‌‌లో మారణహోమం ఇంకెన్నాళ్లు.?

మయన్మార్‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఆర్మీ జుంటా మారణహోమం సాగిస్తోంది. సైన్యం అరాచకాల్ని ప్రజలు ఎదిరిస్తుండటంతో రక్తం ఏరులై పారుతోంది. మయన్మార్​కు స్వాతంత్ర్యం వచ్చాక ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, కొద్దికాలం క్రితమే ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఎన్నో ఏండ్లు పోరాడి గృహ నిర్బంధంలో గడిపిన నోబెల్‌‌‌‌‌‌‌‌ పీస్​ ప్రైజ్​ గ్రహీత ఆంగ్ సాన్ సూకీని తప్పించి తిరిగి సైనిక జుంటా అధికారం దక్కించుకోవడం ప్రపంచ దేశాలను షాక్​కు గురిచేసింది. సూకీతోపాటు రాజకీయ నేతలందరినీ నిర్బంధించడంతో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ‘‘నిర్బంధంలో ఉంచిన నాయకులు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేసి ప్రజల ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించాలి. మయన్మార్‌‌‌‌‌‌‌‌లో పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి”అని యునైటెడ్​ నేషన్స్​ చీఫ్​ గుటెర్రస్‌‌‌‌‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌డీ ఘన విజయం సాధించింది. సైన్యం మద్దతు ఉన్న యూనియన్‌‌‌‌‌‌‌‌ సాలిడారిటీ అండ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఓటమిపాలైంది. మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు నిజమని తేలిపోయింది. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం చేపట్టడానికి వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాము మద్దతిచ్చిన పార్టీ ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకున్నారని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. పాలన పగ్గాలను చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ప్రజాస్వామ్య ఆందోళనకారులను ఊచకోత కోస్తోంది. సూకీ నుంచి పాలన పగ్గాలు లాక్కున్న సైనిక అధికారులు దేశంలో మారణహోమం సృష్టిస్తున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాన్యులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తున్నారు. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులపైనే కాదు.. ఈ మారణహోమాన్ని ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపైనా దాడులకు దిగుతోంది. యాంగాన్, మాండలే, మెన్యవా నగరాల్లో పరిస్థితి భయానకంగా వుంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి మృత్యువు కబళిస్తుందో తెలియక జనం భయంతో గజగజలాడుతున్నారు. ప్రజలపై పగబట్టినట్లుగా సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

జాజుల దినేష్,
ఎంఏ, బీఈడీ, నల్గొండ జిల్లా