చెల్లెలి పెళ్లి రోజే.. అన్న మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కంసాన్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. చెల్లెలు పెళ్లి వివాహ ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మీ జవాన్ శ్రీనివాస్ రాత్రి మృతి చెందారు. చెల్లెలు పెళ్లి జరిగిన రోజునే అన్న కన్ను మూయడం ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. కంసాన్ పల్లికి చెందిన ఇప్పటూరు సత్యమ్మ సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్ గా జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. చెల్లి వివాహం కోసమని ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే  క్రమంలో పది రోజుల క్రితం మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతని గాంధీ ఆసుపత్రికి తరలించగా రాత్రి మృతి చెందాడు. 

ఓవైపు పెళ్లి  వేడుక మరోవైపు విషాదం.. శ్రీనివాసు చెల్లెలు శిరీష కు వికారాబాద్ జిల్లా దారూరు మండలం రాపూర్ కు చెందిన గోవర్ధన్ తో బుధవారం వివాహం జరిగింది. వరుడు స్వగ్రామంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత శ్రీనివాస్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆర్మీ అధికారులు సహచరులు గాలిలో కాల్పులు జరిపి అధికారికా లాంచనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.