- నాగాలాండ్ లో డ్యూటీలో ఉండగా స్ట్రోక్
- మిలటరీ ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి
- డోర్నకల్ టౌన్ లో నెలకొన్న విషాదం
కురవి ,వెలుగు: గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి చెందగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ టౌన్ లో విషాదం నెలకొంది. టౌన్ లోని గొల్లబజార్ కు చెందిన కొదిరిపాక సతీశ్(34) భారత సైన్యంలోని ఆర్టీలరీ విభాగంలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం నాగాలాండ్ లో డ్యూటీలో ఉన్నాడు. కొద్ది రోజుల కింద కొల్ కతా ఆర్మీ బేస్ క్యాంప్ నుంచి డిప్యూటేషన్ పై వెళ్లాడు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా సతీశ్ కు చాతిలో నొప్పి వస్తుందని తోటి సైనికులకు చెప్పగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని బాగ్ డోగ్రా టౌన్ మిలిటరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతని తమ్ముడు వెంకటేశ్, తల్లి ఎల్లాబాయి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. అప్పటికే సతీశ్ఆరోగ్యం విషమించి చికిత్సపొందుతూ చనిపోయాడు. 2011లో ఆర్మీలో చేరిన సతీశ్‌కు రెండేండ్ల కింద లక్ష్మి అనే మహిళతో పెండ్లి అయింది. జవాన్ మృతి వార్త తెలుసుకుని బంధువులు, ఫ్రెండ్స్ డోర్నకల్ టౌన్ లోని ఇంటి వద్దకు తరలివచ్చారు. సతీశ్ డెడ్ బాడీని శుక్రవారం డోర్నకల్ కు ఆర్మీ అధికారులు తీసుకురానున్నట్టు సోదరుడు వెంకటేశ్ తెలిపాడు.