40 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ముగ్గురు జవాన్లు మృతి

40 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ముగ్గురు జవాన్లు మృతి

శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వెళ్తోన్న ఆర్మీ జవాన్ల బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలో పడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ముగ్గురు సైనికులు మరణించగా.. మరో 32 మంది జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, జమ్మూ కాశ్మీర్‎లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 

మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తి అయ్యింది. ఈ నెల (సెప్టెంబర్) 25న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ల కాన్వాయ్ శుక్రవారం బయలుదేరింది. ఈ క్రమంలో బుద్గామ్ జిల్లాలో 35 మంది జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు  జవాన్లు ఘటన స్థలంలోనే మృతి చెందగా.. మిగిలిన సైనికులు గాయపడ్డారు.

ALSO READ | బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న బోటు బోల్తా

 గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించి ఘటన స్థలంలో సహయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సమాచారంతో స్థానిక పోలీసులు , ఆర్మీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు  చేపట్టారు. గాయపడ్డ సైనికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.  ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.