ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా అన్నారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. టెలివిజన్ రేటింగ్స్ పెంచడానికి అర్నాబ్ గోస్వామి నుంచి 12 వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ. 8.75 లక్షలకు పైగా డబ్బులను లంచంగా తీసుకున్నానని చెప్పారు.
రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు 12 వేల డాలర్లతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్‌గుప్తా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఇందులో దాస్‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్‌ను కూడా పొందుపరిచారు. ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. ఆజ్ తక్, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ చానళ్లు రేటింగ్స్ కోసం బార్క్ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో ఫ్రీ-ఫిక్సింగ్ చేసుకున్నాయని తెలుస్తోంది.