- బిల్లులు చెల్లించాలని డిమాండ్
- రూ.100 కోట్ల టోకెన్ అమౌంట్పరిపాటిగా మారింది
- తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగినప్పుడల్లా రూ.100 కోట్ల టోకెన్ అమౌంట్‌ను విడుదల చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఆ పద్ధతికి అంగీకరిస్తామనుకోవడం సరైంది కాదని చెప్పింది. పూర్తి బిల్లుల చెల్లింపు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1200కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ప్రకటించారు.
ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.రాకేశ్ మాట్లాడారు. ఆరోగ్య శ్రీ కింద రోగులకు సేవలు అందిస్తున్నప్పటికీ.. బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీంల కింద అందిస్తున్న వైద్య సేవలకు గానూ నెలకు దాదాపు రూ. 100 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. ప్రతి ఏడాది రూ. 1200 కోట్ల నుంచి రూ. 1300 కోట్ల బిల్లులు చెల్లించాలని వాటి చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగానే ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని డాక్టర్ రాకేశ్ పేర్కొన్నారు.