హుజూర్‌నగర్, నేరేడుచర్ల, వెలుగు : హుజూర్ నగర్‌లో జనం మీద పడి దోచుకుంటున్న దొంగల ముఠాను తరమికొట్టాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజుర్ నగర్ క్యాంపు ఆఫీస్, నేరేడుచర్ల పట్టణంలో ఇతర పార్టీలకు చెందిన దాదాపు 250 మంది ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, ముస్లింలు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ఎన్నికలు రావడంతో కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎంతో మంది అమాయకులపై మీద కేసులు పెట్టించి జైలుకు పంపించారని మండిపడ్డారు. సాగర్ ఆయకుట్టుకు నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, కాంగ్రెస్ 70 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నేతలు చిన్న వెంకటరెడ్డి, నూకల సందీప్ రెడ్డి, జితేందర్ రెడ్డి, శాసనాల నాగ సైదయ్య, వెలిశెట్టి బ్రహ్మం, ఎరగని నాగన్న గౌడ్, దొంగరి వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, బచ్చలకూరి ప్రకాశ్, నాగయ్య, మోతిలాల్, నాగిరెడ్డి, కృష్ణయ్య, సురేశ్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.