- రూ. 1.50లక్షల విలువైన మిర్చి దొంగలించారని రైతు ఆవేదన
వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో మంగళవారం అర్ధరాత్రి సుమారు ఏడు క్వింటాళ్ల మిర్చి చోరీకి గురైంది. విప్పలమడక గ్రామానికి చెందిన రైతు చెరుకూరి కృష్ణారావు తనకున్న నాలుగు ఎకరాల మెట్ట పొలంలో మిర్చి పంటను సాగు చేస్తున్నాడు. కొద్ది రోజులుగా మిర్చి కాయలను కూలీలతో కోపిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో పొలంలో ఏర్పాటు చేసుకున్న కల్లంలో మిర్చిని కుప్పగా పోసి పట్టాకప్పారు. ఆ కుప్పలోని ఏడు క్వింటాలు మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి దొంగిలించారు. బుధవారం ఉదయం కల్లం వద్దకు వెళ్లి చూడగా మిర్చి కనిపించకపోవడంతో కృష్ణారావు వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన మిర్చి విలువ సుమారు రూ.1.50.లక్షల ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.