హుస్సేన్‌సాగర్‌ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు

గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపుగా విగ్రహాల వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. 

నగరంలోని చాలా ప్రాంతాల నుంచి అర్ధరాత్రి తర్వాత విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకురావడంతో ఉదయం పెద్దసంఖ్యలో విగ్రహాలు సాగరంవైపు కదిలాయి. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా నిమజ్జన సందడి కొనసాగుతూనే ఉంది. 

సచివాలయంతోపాటు ట్యాంక్‌బండ్‌ చుట్టుపక్కల రహదారులపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఈ మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

హుస్సేన్ సాగర్ వైపు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తున్నాయి. నిమజ్జనం ప్రక్రియ బట్టి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసరాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ALSO READ : చింతలపాలెం కాంగ్రెస్ నాయకుల్ని వేధిస్తున్నరు 
ఇవాళ వర్కింగ్ డే కావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఫ్లైఓవర్ పై వాహనాలు నిలిచిపోతున్నాయి. లిబర్టీ నుండి ట్యాంక్ బండ్ వైపు గణేష్ విగ్రహాలను మళ్లీస్తుండడంతో ట్రాఫిక్ ఏర్పడుతోంది. సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపునకు విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు.. నిమజ్జనం వేగంగా కొనసాగుతోంది.