కాలు కదపలేం..  చెయ్యెత్తలేం: మాకు కేర్​ టేకర్​ను ఏర్పాటు చేయండి

కాలు కదపలేం..  చెయ్యెత్తలేం:  మాకు కేర్​ టేకర్​ను ఏర్పాటు చేయండి

పంజాగుట్ట, వెలుగు: కండరాల క్షీణతతో బాధపడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మస్క్యులర్​డిస్ట్ర్రోఫీ బాధితులు విజ్ఞప్తి చేశారు. మస్య్కులర్ డిస్ట్రోఫీ అవేర్​నెస్​ మాసోత్సవం సందర్భంగా ‘మా ఘోష’ పేరుతో సోమవారం హైదరాబాద్ లోని ప్రెస్​క్లబ్​లో సమావేశం నిర్వహించారు. దీనికి వందలాది మంది బాధితులు హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మేం నడవలేం.. చేతులు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు. మమ్మల్ని చిన్న పిల్లాడిలా నిత్యం ఒకరు సాకాలి. ప్రభుత్వం మా వ్యథను గుర్తించి కేర్​టేకర్ సదుపాయం కల్పించాలి. లేదంటే దానికి అనుగుణంగా అలవెన్స్ ఇవ్వాలి” అని కోరారు. ఏపీలో ఇప్పటికే కేర్ టేకర్​అలవెన్స్ ఇస్తున్నారని చెప్పారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సమావేశం అనంతరం వీల్​చైర్లతో ఖైరతాబాద్​ చౌరస్తా వరకు ర్యాలీ  నిర్వహించారు.  

20 వేల పెన్షన్ ఇవ్వాలి.. 

కాంగ్రెస్​ప్రభుత్వం మా సమస్యలపై దృష్టిపెట్టాలి. పుట్టిన పిల్లలను తల్లి కొన్నేండ్లే మోస్తుంది. కానీ మా తల్లులు మమ్మల్ని జీవితాంతం మోస్తున్నారు. తీవ్ర వైకల్యం కలిగిన మాకు రూ.20 వేలు పెన్షన్​ఇవ్వాలి. 
- వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ 

మా పరిస్థితి ఎవరికీ రావొద్దు.. 

ఇంకొకరి సాయం లేకుండా మేం ఏమీ చేయలేం. మా పరిస్థితి మరెవరికీ రాకూడదు. సీఎం రేవంత్ రెడ్డి మాకు సాయం చేయాలి.  కె.బాలకృష్ణ , నల్గొండ జిల్లా 

30 ఏండ్లుగా బాధపడుతున్న.. 

9 ఏండ్ల వయసులో ఈ వ్యాధికి గురయ్యా. నడవలేక దాదాపు 30 ఏండ్లుగా బాధపడుతున్న. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.  రవికుమార్, ఇస్నాపూర్​

ప్రభుత్వం ఆదుకోవాలి.. 

చిన్నప్పటి నుంచి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాను. మాది పేద కుటుంబం. ప్రభుత్వం దయతో మమ్మల్ని ఆదుకోవాలి.  సైబాద్ అలీ, చేర్యాల