మునుగోడు బైపోల్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని అన్నారు. ఇక ప్రతి పోలింగ్ సెంటర్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉండనున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలను పోలింగ్ కేంద్రాల దగ్గర మోహరించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సెటప్స్ పూర్తయ్యాయని, లైవ్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చిందని వికాస్ రాజ్ చెప్పారు. ప్రతి చోట కొన్ని ఈవీఎంలను రిజర్వ్‌లో పెట్టామన్నారు. ఈసారి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో మూడు బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నారని తెలిపారు. సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు సీఈవో తెలిపారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. నోటాతో కలిపి 48 సింబల్స్ ఈవీఎంలలో ఉండనున్నాయి. 50 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశామని సీఈవో వెల్లడించారు.
ఈవీఎంలలో సమస్యలు వస్తే వెంటనే సరి చేసేందుకు BHEL నుంచి 28 మంది ఇంజినీర్లను నియోజకవర్గంలో అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ స్టాఫ్‌ను కూడా రిజర్వ్‌లో పెట్టారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉండనుంది. 47 మంది అభ్యర్థులు ఉండడంతో మాక్ పోల్ టెస్ట్ చేసి, వీవీపాట్ క్లియర్ చేయాలంటే కొంత సమయం పట్టనుంది. అందువల్ల పోలింగ్ ఏజెంట్లు ముందుగానే రావాలని వికాస్ రాజ్ కోరారు. 2600 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లలో ఉండనున్నాయి. 298 కేంద్రాల్లో పోలింగ్‌ను కంట్రోల్ రూమ్ నుంచి ఈసీ పరిశీలించనున్నారు. హై ప్రొఫైల్ ఎలక్షన్ కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను పెట్టామని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు 8 కోట్ల 2 లక్షల విలువైన క్యాష్, లిక్కర్, గోల్డ్ వంటివి పోలీసుల తనిఖీల్లో దొరికాయి. 5 వేల లీటర్లకు పైగా లిక్కర్ సీజ్ చేశారు. 870 మందిని బైండోవర్ చేయగా.. ప్రతి గ్రామాల్లో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.