
- వేగంగా దివ్యవిమాన గోపుర స్వర్ణతాపడం, యాగశాల పనులు
- ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మహోత్సవాల నిర్వహణ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ‘పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ’ ప్రతిష్ఠా మహోత్సవాల పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే దివ్యవిమాన గోపురానికి స్వర్ణతాపడం బిగింపు పనులు పూర్తి కాగా ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి.
అలాగే ప్రధానాలయానికి ఈశాన్యంలో యాగశాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ యాగశాలలో ఐదు రోజుల పాటు ‘పంచకుండాత్మక సుదర్శన నృసింహ యాగం’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యాగశాలకు నాలుగు దిక్కులు (మార్గాలు), ఐదు కుండలాలు ఏర్పాటు చేశారు. యజ్ఞం కాల్చడానికి అవసరమైన మోదుగు కర్రలు అందుబాటులో ఉంచారు. కోతుల కారణంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా యాగశాల మొత్తాన్ని ప్రత్యేకమైన నెట్‌తో కప్పేశారు.
ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం : ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్
యాదగిరిగుట్ట దివ్యవిమాన గోపురానికి స్వర్ణతాపడం బిగింపు పనులు పూర్తి కావడంతో సంప్రోక్షణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఈవో భాస్కర్‌రావుతో కలిసి సోమవారం యాదగిరిగుట్టలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, చేయాల్సిన పనులు, భద్రతపై చర్చించారు.
అనంతరం కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ మహాకుంభ సంప్రోక్షణ కోసం కేటాయించిన పనులను సంబంధిత ఆఫీసర్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి సహా డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని, ఇందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీఐపీల రాక కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
భారీసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున టాయిలెట్స్, వాష్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ సేవలు, అవసరమైన అన్ని మందులను అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌కుమార్, తహసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీవో నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
ఆలయాన్ని నీటితో శుద్ధి చేసిన సిబ్బంది
యాదగిరిగుట్ట ఆలయంలో రేపటి నుంచి సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేశారు. ప్రధానాలయం, గర్భగుడి, ఉపాలయాలు, ప్రాకారాలు, బాహ్య, అంతర మాడవీధులు, అష్టభుజి ప్రాకార మండపాలను నీటితో కడిగారు. ఆలయ ఈవో భాస్కర్‌రావు కూడా గర్భగుడి ప్రధానాలయ ముఖ మంటపాన్ని స్వయంగా శుద్ధి చేశారు. సప్తగోపుర సముదాయమైన ప్రధానాలయాన్ని నీటితో కడిగి ఉత్సవాలకు సిద్ధం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతించారు.