యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మత్తులు

భద్రాచలం, వెలుగు: రాష్ట్రపతి భద్రాచలం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వస్తున్న రాష్ట్రపతి కేంద్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రూ.41.38 కోట్ల పనులకు భూమి పూజ చేయనున్నారు. ఐటీసీ గెస్ట్ హౌస్​లో దిగి కొద్ది సేపు సేద తీరాక రాముడి దర్శనానికి వస్తారు. 

దీంతో ఆమె ప్రయాణించే మార్గంలో ఈ నెల 28 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు పెట్టారు. గోదావరి వంతెనపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు.  విజయవాడ–-జగదల్​పూర్​ హైవే, భద్రాచలం–చండ్రుపట్ల స్టేట్​ హైవేలను రిపేరు చేస్తున్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా రాష్ట్రపతి వస్తారు. టుబాకో బోర్డు ఆవరణలో హెలీప్యాడ్​ ఏర్పాటు చేశారు. సోమవారం ట్రయల్​ ల్యాండింగ్​ నిర్వహించారు.

కరోనా టెస్టులు..

కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. స్టాఫ్​కు సోమవారం ఐటీసీ, వీరభద్ర ఫంక్షన్​హాల్​లో కరోనా టెస్టులు చేశారు. దేవస్థానం ఈవో శివాజీతో పాటు స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, సీతారామానుజం, వేదపండితులు మురళీకృష్ణమాచార్యులు, ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, ఈఈ రవీందర్, సీసీ అనిల్​కుమార్ లతో పాటు ఆలయంలో పని చేసే ఉద్యోగులుందరికీ టెస్టులు చేశారు. వీరభద్ర పంక్షన్​ హాలు వద్ద 145 మంది గిరిజన పూజారులు రాష్ట్రపతితో భేటీ కానున్నారు. రాష్ట్రపతిని కలిసే పటేళ్లు, పూజారులు, యాపారీలకు పరీక్షలు చేయనున్నారు. వారిని ఉదయం 8 గంటలకే ఫంక్షన్​ హాలుకు తరలించాలని వనవాసీ కల్యాణీ ఆశ్రమం నిర్వాహకులను ఐటీడీఏ ఆఫీసర్లు ఆదేశించారు. షాపులను మూసివేయించడంతో పాటు 144 సెక్షన్​ విధించారు. నేషనల్​ మీడియాకు మాత్రమే అనుమతి ఉందని, స్థానిక మీడియాకు పర్మిషన్​ లేదని కలెక్టర్​ తెలిపారు.

విధులు పకడ్బందీగా నిర్వహించాలి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో భాగంగా విధులు కేటాయించిన ఆఫీసర్లు 27న ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయాలని కలెక్టర్ తెలిపారు.  సోమవారం భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ట్రయల్ రన్  నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో డ్యూటీకి సిద్ధంగా ఉండాలని చెప్పారు. 

దేవాలయంలో షామియానాలు, కార్పెట్లను వేయాలని ఆదేశించారు. దేవాలయంలో గ్రీన్ రూమ్​ సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్వామి వారి ప్రత్యేక పూజల అనంతరం వీరభద్ర ఫంక్షన్ హాల్ కు రాష్ట్రపతి చేరుకుంటారని, కొమ్ముకోయ నృత్యంతో రాష్ట్రపతికి  స్వాగతం పలుకుతారన్నారు. అనంతరం వర్చువల్ గా మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్  రెసిడెన్షియల్  స్కూల్స్​ను ప్రారంభిస్తారని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

అనంతరం బూర్గంపాడు, సారపాక ఐటీసీ బీపీఎల్  స్కూల్​లో  ఏర్పాటు చేసిన హెలీపాడ్  పనులను కలెక్టర్, ఎస్పీ డా వినీత్​ పరిశీలించారు. వాయుసేన సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ నిర్వహించారని, ట్రయల్ రన్  అనంతరం చేసిన సలహాలు, సూచనల ప్రకారం మంగళవారం వరకు పనులు కంప్లీట్​ చేయాలని సూచించారు. అలాగే దేవాలయం, వీరభద్ర ఫంక్షన్  హాలులో ఏర్పాట్లను 
పరిశీలించారు.