- ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర.. రూ.105 కోట్లతో సౌలత్లు
- కోటిన్నర మంది వస్తారని అంచనా
- 6 వేల బస్సులు.. మహిళలకు ఫ్రీ జర్నీ
- 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలు
- 500 సీసీ కెమెరాలు.. 10 వేల మంది పోలీసులు.. 24 గంటల వైద్య సేవలు
- సమీక్షించిన మంత్రులు పొన్నం, సీతక్క
ములుగు హనుమకొండ, వెలుగు: సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం రూ.105 కోట్లతో భక్తులకు సౌలత్లు కల్పిస్తున్నది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా మేడారం మహాజాతర రూట్‌మ్యాప్‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మౌలిక వసతులు, నిర్వహణ కోసం ఈసారి రూ.105 కోట్లు కేటాయించింది. జాతర కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆఫీసర్లు రూ.75 కోట్లతో అప్పటి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా రూ.75 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత మంత్రులు సీతక్క, కొండా సురేఖ విజ్ఞప్తుల మేరకు అదనంగా మరో రూ.30 కోట్లు ఇచ్చారు. దీంతో రూ.70 కోట్లతో ఇంజినీరింగ్ వర్క్స్, రూ.35 కోట్లతో నాన్ ఇంజినీరింగ్ వర్క్స్ చేపట్టారు. జనవరిలో పనులు మొదలుకాగా ఇప్పటికే 80 శాతం పనులు జరిగినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 10వ తారీఖులోపు మొత్తం పనులు కంప్లీట్ చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
2 వేల మంది వైద్య సిబ్బంది
జాతరకు వారం ముందు నుంచే మేడారంలో భక్తుల కోసం 24 గంటల వైద్య సదుపాయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తేనుంది. ప్రభుత్వం తరపున 30 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అత్యవసరంగా రోగులను తరలించేందుకు108 వెహికిల్స్15, తాత్కాలిక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అన్నీ చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 పడకలతో కూడిన వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి రెండు వేల మందికి పైగా ఉద్యోగులు జాతరలో విధులు నిర్వహిస్తారని ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు.
వేర్వేరు మార్గాల్లో పార్కింగ్
మేడారం మహాజాతర రూట్‌మ్యాప్‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతరకొచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి వీలుగా ములుగు ఎస్పీ శబరీశ్‌ఆధ్వర్యంలో పోలీస్ శాఖ 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేసింది. వీఐపీ, వీవీఐపీ, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్లేస్‌లు ఇచ్చారు. పస్రా‒ మేడారం, భూపాలపల్లి‒ మేడారం, తాడ్వాయి‒మేడారం, ఏటూరునాగారం‒మేడారం మార్గాల్లో ఈ పార్కింగ్ స్థలాలు చదును చేశారు. అక్కడ ఇన్, ఔట్‌లెట్లు, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
మహాలక్ష్మి స్కీం కింద పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జాతరకు వచ్చే మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ వసతి కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల బస్సుల్లో సుమారు 40 లక్షల మంది భక్తులను తీసుకురావడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు నిర్మించారు. 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులను పర్యవేక్షిస్తున్నామని వరంగల్ ఆర్‌ఎం శ్రీలత ప్రకటించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తున్నది. బస్సుల్లో వచ్చే భక్తులు గద్దెలకు అర కిలోమీటర్ దూరందాకా చేరుకోవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్‌ఎం ప్రకటించారు.
వన్ వే రూట్లు ఇవే!
జాతర జరిగే 4 రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు వన్‌వే రూట్లను ప్రకటించారు. ప్రైవేట్ వాహనాల్లో భక్తులు జాతరకొచ్చే దారి, వెళ్లిపోయే దారులు వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలనుంచి వచ్చే భక్తులు గుడెప్పాడ్, పస్రా మీదుగా మేడారం చేరుకోవాలి. కరీంనగర్, ఆదిలాబాద్ రూట్ల నుంచి వచ్చేవాళ్లు గాంధీనగర్, జంగాలపల్లి క్రాస్, పస్రా మీదుగా లేదా కాటారం, చింతకాని మీదుగా మేడారం చేరుకోవచ్చు. ఆంధ్రా, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చేవాళ్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చిన్నబోయినపల్లి రూట్‌నుంచి వచ్చిన వాళ్లు అదే రూట్‌లో వెళ్తారు. మిగిలిన అందరూ కూడా మేడారం‒నార్లాపూర్ క్రాస్‌మీదుగా భూపాలపల్లి దగ్గర్లోని కమలాపూర్ క్రాస్ రోడ్‌కు చేరుకొని అక్కడి నుంచి తమ దారిలో వెళ్లిపోతారు. ఈ వన్ వే రూట్ల ప్రకారమే పోలీసులు పార్కింగ్ స్థలాలను సైతం కేటాయిస్తున్నారు.
30 వేల మందికి పైగా ఉద్యోగులు
మేడారం జాతరలో 30 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించడానికి రెడీగా ఉన్నారు. ఒక్క పోలీస్‌శాఖ తరపునే10 వేల మందికి పైగా డ్యూటీలు వేశారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందిస్తారు. మంత్రులు, రాష్ట్ర, జిల్లాస్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు కలెక్టర్, ఎస్పీ వారం పాటు మేడారం జాతరలోనే ఉండేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులకు డ్యూటీ లెటర్లు పంపించారు.
డ్రోన్లతో పర్యవేక్షణ
మేడారం మహాజాతరలో ఏ మూలకు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే పోలీసులు, ఇతర ఆఫీసర్లు అక్కడికి చేరుకోవడానికి వీలుగా జాతర చుట్టూ 500 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్ చేశారు. రహదారులతో పాటు జాతర కోర్‌ఏరియా, భక్తుల క్యూలైన్లు.. ఇలా అన్ని చోట్లా కెమెరాలు బిగించారు. పోలీస్ శాఖ 3 డ్రోన్ కెమెరాలతో జాతరను పర్యవేక్షణ చేయనున్నట్లు ఎస్పీ శబరీశ్ ప్రకటించారు.
మహా జాతర తేదీలు
ఫిబ్రవరి 21: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు వస్తారు
ఫిబ్రవరి 22: సమ్మక్క గద్దెకు వస్తుంది
ఫిబ్రవరి 23: మొక్కులు సమర్పించుట
ఫిబ్రవరి 24: అమ్మవార్ల వనప్రవేశం
స్పెషల్ బస్సుల్లోనూ మహాలక్ష్మి స్కీం: మంత్రి పొన్నం
మేడారం మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల ద్వారా భక్తులను తరలించేందుకు 6 వేల ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మేడారం స్పెషల్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు చేస్తామని, మహిళలు, బాలికలు బస్సుల్లో ఫ్రీగా రావచ్చన్నారు. సోమవారం మంత్రి సీతక్కతో కలిసి మేడారం చేరుకున్న మంత్రి.. ఆర్టీసీ పికెటింగ్ పాయింట్, క్యూలైన్లు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ముందుగా ములుగు గట్టమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని ఎత్తు బంగారం ఇచ్చారు. జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రులు పరిశీలించి, ఆఫీసర్లతో రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల16న మేడారంలో టీఎస్ఆర్టీసీ బేస్ క్యాప్‌ను ప్రారంభిస్తామన్నారు. జాతర కోసం దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. భక్తుల ఇంటింటికీ అమ్మవార్ల పసుపు, కుంకుమతో పాటు బంగారం(ఎత్తు బెల్లం) పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పనులు పూర్తి దశకు వచ్చాయి: మంత్రి సీతక్క
వనదేవతలు సమ్మక్క సారలమ్మల దయతోనే 2014లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని మంత్రి సీతక్క తెలిపారు. మహాజాతర కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. జాతీయ రహదారి పనులు పూర్తికావాల్సి ఉందని, జాతరలో మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన పనులు చివరి దశకు వచ్చాయ న్నారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను పెంచామని చెప్పారు. 1996లోనే మేడారం రాష్ట్ర పండుగ జాబితాలోకి వచ్చిందని, ప్రస్తుతం జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నామన్నారు. మేడారం మహాజాతరను ఈసారి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహిస్తున్నామని, జాతరకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తమ వెంట తీసుకురావద్దని సూచించారు.
11 చోట్ల ఫ్రీ వైఫై సేవలు
మేడారం మహా జాతరలో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై సేవలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 16 చోట్ల హాట్స్పాట్లు ఏర్పాటు చేయనుంది. 15 నుంచి 25వ తేదీ దాకా సేవలు అందుబాటులో ఉంటాయి. 20 మంది సిబ్బందితో కూడిన మూడు బృందాలు వైఫై సెటప్ రెడీ చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ వరంగల్ జీఎం చంద్రమౌళి, డిప్యూటీ జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి సోమవారం తెలిపారు. ప్రతిరోజు వన్ జీబీ డేటా ఫ్రీగా అందిస్తామన్నారు. 10 నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో సేవలు అందుతాయని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ పేరుతో కనిపించే నెట్‌వర్క్‌ను కనెక్ట్ చేసుకుంటే వైఫై వస్తుందన్నారు.
తాగునీటి అవసరాలకు రూ.4.21 కోట్లతో పనులు
మేడారం జాతరలో ఈ సారి మిషన్ భగీరథ పథకం ద్వారా భక్తులకు రక్షిత మంచినీరు అందించడానికి రూ.4.21 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికే నిర్మించిన మూడు వాటర్‌ట్యాంక్‌లతో పాటు జాతర చుట్టు పక్కల ప్రాంతాల్లో 50కి పైగా మినీ వాటర్‌ట్యాంక్‌లు ఉన్నాయి. జాతర కోర్ ఏరియాలోని 10 ప్రాంతాల్లో 5 వేల వరకు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్(బీవోటీ)లను ఏర్పాటు చేశారు. భక్తులు నీరు పట్టుకునేలా విధంగా వీటిని నిర్మించారు.
భక్తుల స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్
మేడారం వచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఇందుకోసం వారం రోజుల పాటు లక్నవరం నుంచి నీళ్లు వదలాలని నిర్ణయించారు. నీళ్లల్లోకి దిగి స్నానాలు చేయలేని వారి కోసం జంపన్నవాగుకు రెండు వైపులా సుమారు 4 కి.మీ పొడవునా రూ.1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్‌ట్యాప్స్ ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో జంపన్నవాగులో నిర్మించిన బావుల పూడికతీత పనులు కూడా పూర్తికావచ్చాయి. మోటార్లు పనిచేయడానికి కరెంట్ కనెక్షన్లతో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు. కాగా, జంపన్నవాగు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా టెంపరరీ రూములను ఏర్పాటుచేశారు. మేడారం జాతరలో బట్టలు మార్చుకునే గదులు సరిపోక గతంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఈసారి జంపన్నవాగు పొడవునా 4 కి.మీ దూరం రెండు వైపులా ప్రతి 20 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేశారు.