
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న జరిగే గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులందరూ గరుడసేవలో పాల్గొని సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం( సెప్టెంబర్ 14) అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ గరుడసేవ దర్శనం
గరుడసేవ రోజు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.