హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్. ప్రతియేటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. జూన్ 8వ తేదీ శనివారం ఉదయం చేప మందు కార్యక్రమాన్ని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
ఈక్రమంలో జూన్ 7వ తేదీ పంపిణీకి సంబంధిత ఏర్పాట్లను సాయి కుమార్ పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ నుంచి 1లక్ష 60వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. గతేడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇప్పటికే టోకన్ తీసుకునేందుకు చాలామంది తరలివచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆస్తమా రోగులకు బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి బోనజాన్ని అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. శనివారం చేప మందు పంపిణీకి టోకెన్ లను ఈరోజు నుండే విక్రయిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాంపల్లి ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు.