- జిల్లాలో 5,700 మండపాలు
- మంగళవారం 11 గంటలకు శోభాయాత్ర షురూ
- 8 ఫీట్లకంటే ఎత్తున్న విగ్రహాల మళ్లింపు
- నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, సీసీ కెమెరాలు, గజ ఈతగాళ్లు
- 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
- సమస్యాత్మక ఏరియాలపై ఇంటెలిజెన్స్నిఘా
- రౌడీ షీటర్ల కదలికలపై ఫోకస్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సార్వజనిక్ గణేశ్నిమజ్జనం, శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత యాడాది కంటే ఈసారి పది శాతం వినాయక మండపాలు పెరిగాయి. మొత్తం 5700 విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వగా, తొమ్మిది రోజులు పూర్తయ్యే నాటికి వెయ్యి విగ్రహాల నిమజ్జనం ముగిసింది. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న 4700 గణేశ్ విగ్రహాల నిమజ్జనం మంగళవారం జరగనుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నిమజ్జం కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ డైవర్షన్..బాసర బ్రిడ్జి క్లోజ్
నిజామాబాద్ నగరంలోని దుబ్బ ఏరియా నుంచి సార్వజనిక్ గణేశ్‌మండలి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం రథాన్ని ముస్తాబు చేశారు. రథాన్ని లాగడానికి 15 జతల ఎడ్లను సిద్ధం చేశారు. బోధన్ సబ్‌డివిజన్‌లో 1,079 ఆర్మూర్ సబ్ డివిజన్లో 470 వినాయక విగ్రహాల నిమజ్జన యాత్ర అప్పుడే షురూ అవుతుంది. చిన్న సైజు విగ్రహాలను నగరంలోని వినాయక్‌నగర్ బావిలో నిమజ్జనం చేస్తారు. బోధన్‌లో పసుపు వాగు, శక్కర్‌నగర్‌లో గణేశ్ బావి, ఆర్మూర్‌లో గూండ్ల చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. అధిక శాతం ఆరు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలు ప్రతిష్ఠించినందున వాటిని గోదావరిలో నిమజ్జనం చేస్తారు.
జిల్లాలో 4,700 విగ్రహాలకు అదనంగా హైదరాబాద్, జగిత్యాల నుంచి విగ్రహాలు వస్తాయని పోలీసులు అంచనా వేశారు. ట్రాఫిక్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నాలుగు రూట్లలో ఆంక్షలు విధించారు. రాజధాని నుంచి వచ్చే వాహనాలు సిటీలోకి ఎంటర్ కాకుండా బైపాస్ నుంచి మళ్లిస్తున్నారు. వర్ని చౌరస్తా మీదుగా బాన్స్వాడ వెహికల్స్, బోధన్ వెళ్లే వాహనాలు న్యూకలెక్టరేట్ రోడ్మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్‌లను ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా డైవర్ట్ చేశారు. రెండు రోజుల పాటు బాసర బ్రిడ్జిపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును కందకుర్తి వైపు మళ్లించారు.
విగ్రహాల మళ్లింపు కూడా
నిజామాబాద్ పక్కనున్న జాన్కంపేట రైల్వేలైన్‌పై హైటెన్షన్ కరెంట్ లైన్‌ఉంది. ఎనిమిది ఫీట్లకంటే ఎత్తున్న విగ్రహాలు రైల్వేట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో నందిపేట ఉమ్మెడ వద్ద గోదావరికి వాటిని మళ్లించనున్నారు. బోధన్ మీదుగా వెళ్లే విగ్రహాలు సాటాపూర్ మీదుగా కందకుర్తికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా రెండురోజులు మద్యం దుకాణాలు క్లోజ్ చేయించారు.
అడుగడుగునా నిఘా
జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో సీపీ కల్మేశ్వర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు సీఐ, ఎస్ఐ లతో కలిపి మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు. భక్తులతో కలిసిపోయేలా మఫ్టీ పోలీసులు, మహిళా పోలీసులకు డ్యూటీలు వేశారు. శోభాయాత్ర మొదలుకొని నిమజ్జనం ముగిసే దారిలో వందలాది సీసీ కెమెరాలు బిగించి వాటిని జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించనున్నారు.
గోదావరిలో నిమజ్జన పాయింట్ల వద్ద ఫ్లడ్ లైట్లు, క్రేన్లు, గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. డీజే కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసు ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ ఇప్పటికే స్పష్టం చేశారు. 70 దాకా ఉన్న సెన్సిటివ్ ఏరియాలపై మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ పోలీసులు ప్రతీఒక్కరిపై నిఘా పెట్టాయి. మతపరమైన అల్లర్లకు పాల్పడి రౌడీషీటర్లుగా నమోదైన వారిని బైండోవర్ చేశారు.