- కులం, ఆదాయం, ఆస్తి తదితర వివరాలు నమోదు
- మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి
- తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు ఈ సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. ప్రస్తుతం ఇండ్లకు నంబర్లు వేసే పనిలో అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు.
ఈ సర్వే ద్వారా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ముఖచిత్రం తేటతెల్లం కానుందని అభిప్రాయపడుతున్నారు. కులం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే క్రిమినల్‌చర్యలు తీసుకుంటామని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేం దుకే ఈ ప్రక్రియ చేపడుతున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ స్పష్టం చేశారు.
అన్ని వివరాలు చెప్పాల్సిందే..
కుటుంబ సర్వేలో కులంతో పాటు ఆదాయం, ఆస్తులు వంటి వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు.
తెలంగాణలో ఆయా కులాల జనాభా ఎంత, ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారు ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వారికి ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు, ఎలా సంపాదించారు, ఇప్పటివరకు ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారు వంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
75 ప్రశ్నలతో ఫార్మాట్
75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్లో ప్రతి కుటుంబానికి ఒక సీరియల్ నంబర్‌ను, జిల్లా, మండలం, గ్రామం, ఆవాసాలకు కోడ్ నంబర్లు కేటాయించారు. పార్ట్1లో 2 నుంచి 11 కాలమ్స్ సాధారణ వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ యజమానితో పాటు సభ్యుల వ్యక్తిగత వివరాలు అంటే యజమాని, కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, సామాజికవర్గం, కులం, కులానికి ఇతర పేరు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్ వంటి వివరాలను నమోదు చేస్తారు. 12 నుంచి 19 కాలమ్స్‌లో విద్య వివరాలు తెలుసుకుంటారు. మొబైల్ నంబర్, దివ్యాంగులు అయితే రకం, వైవాహిక స్థితి, స్కూల్లో చేరే నాటికి వయసు, స్కూల్రకం, అత్యున్నత విద్యార్హత, ఏ మీడియం చదివారు, స్కూల్ మానేస్తే దానికి సంబంధించిన వివరాలు ఒకటి నుంచి 19వ కాలమ్ వరకు అడుగుతారు.
ఏం పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు?
పార్ట్1లో 20 నుంచి 30వ కాలమ్వరకు ఉద్యోగ ఉపాధి వివరాలు ఉంటాయి. 31 నుంచి 40 కాలమ్స్‌లో భూమి వివరాల్లో మీరు భూమి కలిగి ఉన్నారా, ధరణి పాస్బుక్కలిగి ఉంటే నంబర్, భూమిని ఏ రూపంలో పొందారు, అది పట్టానా, అసైన్డ్ భూమినా, అటవీ హక్కుల కింద పొందారా, నీటిపారుదల సౌకర్యం ఉందా, కౌలుభూమిలో సాగు చేస్తున్నట్టయితే విస్తీర్ణం వివరాలు తెలుపాల్సి
ఉంటుంది.
పార్ట్ 2లో ఆస్తులు, అప్పుల వివరాలు
41 నుంచి 45 కాలమ్స్‌లో రిజర్వేషన్ ప్రయోజనాలు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. 46 నుంచి 48 కాలమ్స్‌లో రాజకీయ నేపథ్యం, వలసల వివరాలు ఉంటాయి. ఇక పార్ట్2లో 48 నుంచి 56 కాలమ్స్ఆస్తులు, అప్పులు తదితర వివరాలు ఉంటాయి. గత ఐదేండ్లలో ఏవైనా లోన్లు తీసుకున్నారా, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారా, కుటుంబానికి చెందిన పశుసంపద, కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఆస్తులు, వాహనాలు, రేషన్ కార్డు నంబర్, నివాస గృహం విస్తీర్ణం, ఇల్లు రకం, తాగునీటి వనరు, కరెంట్, బాత్రూమ్ ఉందా, ఇంట్లో ఎన్ని రూమ్‌లు ఉన్నాయి, వంటకు ఏ ఇంధనం వాడుతున్నారు వంటి వివరాలను తెలియజేయాలి. ఈ కాలమ్స్‌లో ఉన్న అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి.