జాన్ పహాడ్ ఉర్సుకు ఏర్పాట్లు చేయండి : వెంకట్‌రావు

సూర్యాపేట, నేరేడుచర్ల, వెలుగు:  జాన్ పహాడ్ ఉర్సుకు  పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకట్‌రావు అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్‌లో పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగనున్న ఉర్సు ఏర్పాట్లపై అడిషనల్‌ కలెక్టర్ ప్రియాంకతో కలసి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ఉర్సు నిర్వహణకు  హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి నోడల్ అధికారిగా నియమించామన్నారు.

దర్గా ఆవరణను చదును చేసి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్,  విద్యుత్‌, తాగునీరు, మెడికల్ క్యాంపులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   విద్యుత్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, మెడికల్, రెవెన్యూ శాఖల అధికారులు, పోలీసులు పక్కాగా డ్యూటీ చేయాలన్నారు.  

ఈ సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో సురేశ్ కుమార్, డీపీవో యాదయ్య, డీఎస్పీ నాగభూషణం, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్‌‌ మహమూద్, సర్పంచ్ కృష్ణ, శ్రీనివాస్, జానీ తదితరులు పాల్గొన్నారు.

ఉజ్వల యోజన కింద కొత్త కనెక్షన్లు

అర్హులందరికీ ఉజ్వల యోజన కింద కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నామని వెంకట్‌రావు తెలిపారు. సోమవారం  సివిల్‌ సప్లై అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ...  అర్హులైన వారు గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.   తప్పనిసరిగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జతపర్చాలన్నారు.

జిల్లా స్థాయి ఉజ్వల కనెక్షన్‌ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, నోడల్‌ ఆఫీసర్‌‌గా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చెందిన అంకుర్‌ అశోక్‌, సభ్యులుగా  సివిల్‌సప్లై అధికారి, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ ప్రతినిధులు ఉంటారని తెలిపారు.   తర్వాత లేబర్ డిపార్ట్‌మెంట్ సమీక్షలో మాట్లాడుతూ..  అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ కార్డుల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.  అర్హులైన కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. 1 లక్ష  ఎక్స్‌గ్రేషియో వస్తుందని తెలిపారు.