భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జోరందుకున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు సీతారామచంద్రస్వామి దేవస్థానం కల్యాణ తలంబ్రాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాదుకు చెందిన వేణు అనే భక్తుడు క్వింటా ముత్యాలను రూ.14 లక్షలు వెచ్చించి సీతారాముల కల్యాణం కోసం ఇచ్చారు. ఆర్టీసీ కార్గో ద్వారా లక్ష తలంబ్రాల ప్యాకెట్లు, పోస్టల్లో 50 వేల ప్యాకెట్లు, ఆలయంలో అమ్మడానికి 50 వేలు తొలిదశలో తయారు చేయాల్సి ఉంది. ఇందుకోసం అవసరమయ్యే ముత్యాలను భక్తుల నుంచి విరాళంగా తీసుకుని, మిగిలినవి దేవస్థానమే కొనుగోలు చేస్తోంది. ఈసారి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల కొరత రాకుండా ఉండేందుకు వాటి తయారీకి మెషిన్కొనుగోలు చేశారు.
రెండు మూడు రోజుల్లో దేవస్థానానికి ఇది చేరుకోనుంది. ఒక్క రోజులో 30 వేల ప్యాకెట్లను దీంతో తయారు చేయవచ్చు. వీటితో పాటు పులిహోర ప్రసాదం తయారీకి కూడా ప్యాకెట్ల కోసం మెషిన్కొనుగోలు చేశారు. శ్రీరామనవమితో పాటు 12 ఏళ్ల పండుగ కల్యాణం మరుసటి రోజు జరిగే శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదాల కొరత తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో శ్రీరామనవమి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్యాణ వేదిక మిథిలా స్టేడియంలో మండపానికి, ప్రధాన ద్వారానికి రంగులు పూర్తి చేశారు. ఆలయంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉగాది నాటికి పూర్తి చేసేలా దేవస్థానం యాక్షన్ప్లాన్అమలు చేస్తోంది.