హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 200 ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు వేయాలన్నారు. క్రిస్మస్ సంబురాల నిర్వహణపై ప్రజాభవన్లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో బుధవారం భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల పెద్దలు పాల్గొనేలా చూడాలి. ఈ మేరకు వారందరికీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ ఇన్విటేషన్లు పంపాలి. సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థలకు సీఎం నగదు పురస్కారాలు అందజేస్తారు. దీని కోసం సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది. ఈ బాధ్యతలు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత చూసుకుంటారు’’అని భట్టి తెలిపారు. రివ్యూ మీటింగ్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సెక్రటరీ తఫ్సీర్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.