- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు : శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శనివారం కలెక్టరేట్ పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 340 మంది సిబ్బందిని నియమించామన్నారు.
16 రూట్ల వారీగా 71 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. 19 సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి నిఘా పెట్టామని తెలిపారు. ఆయన వెంట జడ్పీ సీఈవో అప్పారావు, డీఎస్ వో మోహన్ బాబు, ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు, ఏవో సుదర్శన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.