గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు :  గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థుల చేతులకు మెహందీ, టాటూలు ఉంటే అనుమతి ఉండదని యాదాద్రి కలెక్టర్​ హనుమంతు జెండగే తెలిపారు. పరీక్ష నిర్వహణపై కలెక్టరేట్లో నిర్వహించిన  ట్రైనింగ్​లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రూప్​-1 పరీక్షకు వేలి ముద్ర తప్పని సరి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చేతులకు మెహందీ, టాటూలు ఉంటే అభ్యర్థుల వేలి ముద్రలు సరిగా పడవని  అన్నారు. ఈ పరీక్షకు 3349 మంది హాజరవుతున్నారని తెలిపారు. హాజరయ్యే ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.

అభ్యర్థులు సాక్సులు లేకుండా చెప్పులతోనే ఎగ్జామ్​ సెంటర్​కు రావాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పొందిన ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు కేవలం పెన్ను మాత్రమే తీసుకొని ఎగ్జామ్​కు రావాలని తెలిపారు. డౌన్​లోడ్​ చేసుకున్న హాల్​ టికెట్​పై లేటెస్ట్​గా తీసుకున్న పాస్​పోర్ట్​ సైజు ఫొటోను అతికించాలన్నారు. హాల్​ టికెట్​పై ముద్రించిన అభ్యర్థి ఫొటో సరిగా లేకుంటే.. గెజిటెడ్​ ఆఫీసర్​ లేదా అభ్యర్థి చివరగా చదివిన కాలేజి ప్రిన్సిపాల్​తో ధృవీకరించిన మూడు ఫొటోలను, అండర్​ టేకింగ్​ ఫారంతో పాటు తీసుకోని రావాలని చెప్పారు.

లేని పక్షంలో పరీక్షకు అనుమతించమని తెలిపారు. ఎగ్జామ్​ రోజున ఉదయం 9 నుంచి 10 గంటలలోపు సెంటర్​లోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధ రెడ్డి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే నారాయణ రెడ్డి, టీజీపీఎస్​సీ రీజనల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ, వ్యవసాయ శాఖ ఏడీ నీలిమ, అధికారులు పాల్గొన్నారు.

నల్గొండ అర్బన్, వెలుగు :  జూన్ 9 న నిర్వహించనున్న గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అడిషనల్​ ఎస్పీ రాములు నాయక్​ చెప్పారు. గురువారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ  రాములు నాయక్ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు, బయో మెట్రిక్  ఇన్విజిలేటర్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష  నిర్వహణకు   జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

జిల్లా  నుంచి 16,899 మంది అభ్యర్థులు     పరీక్షకు హాజరవుతున్నట్టు  పేర్కొన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  అభ్యర్థులు ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్ లు, బ్లూ టూత్ డివైస్ లు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్​ బుక్కులు తీసుకురావద్దని చెప్పారు.  పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదని, పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి అప్పగించాలన్నారు.

 తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని, బయోమెట్రిక్ వేయని, ఓఎంఆర్ ఆన్సర్ సీటును అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్లు దిద్దబడవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ రమేశ్​, రిజనల్ కో ఆర్డినేటర్ ఉపేందర్, చీప్ సూపరింటెండెంట్లు, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.