
- రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో నిలిపే అరుదైన అవకాశం
- ప్రతినిధులు చారిత్రక, టూరిస్ట్ ప్లేసులను సందర్శించేలా ఏర్పాట్లు చేయండి
- అతిథి మర్యాదల్లో ఎక్కడ, ఎలాంటి లోటూ రావద్దు
- ఎయిర్ పోర్టు, హోటళ్లు, వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి
- హైదరాబాద్‌లో బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మే 10న హైదరాబాద్‌లో ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మే 7 నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో ఆరుగురు కాంటినెంటల్ విజేతలు, కొత్త మిస్ వరల్డ్ ప్రకటన జరుగుతుందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, స్పోర్ట్స్, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతారని 140 దేశాల్లో లైవ్ ప్రసారం జరుగుతుందని వెల్లడించారు.
పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 140 దేశాల నుంచి పార్టిసిపెంట్స్, ప్రతినిధులు రానున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటూ రావొద్దన్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు, హోటళ్లు, ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో నిలిపేందుకు ఇదో అరుదైన అవకాశమని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వం, ఆధునికతను ప్రపంచ వేదికపై ఆవిష్కరించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వేడుకలు జరగనున్న మూడు ప్రధాన వేదికలు.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, శిల్పకళా వేదిక, హైటెక్స్ లో ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. మిస్‌వరల్డ్ పోటీల ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రమోట్చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఇందులో భాగంగా పోటీదారులు, ప్రతినిధులు రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఆయా చోట్ల పోటీదారులు, ప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఏర్పాట్ల పర్యవేక్షణకు విభాగాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మిస్ వరల్డ్ పోటీ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఏర్పాట్లు, కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ఇదే..
ప్రపంచం నలుమూలల నుంచి140 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ చేరుకుంటారని, ఏయే తేదీల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయో సీఎంకు అధికారులు వివరించారు.
- మే 10 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీ.
- మే 13న హైదరాబాద్ ‘హెరిటేజ్ వాక్’. ఇందులో భాగంగా పార్టిసిపెంట్స్ చార్మినార్, లాడ్ బజార్ సందర్శన.
- మే 14న వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రంలో విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో అమెరికా, కరీబియన్(గ్రూప్ 1) మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్షన్. అదేరోజు కాకతీయ హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్ప సందర్శన.
- మే 15న స్పిరిచువల్ టూర్ లో భాగంగా యూరప్(గ్రూప్ 2) కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదగిరిగుట్ట, పోచంపల్లి సందర్శన
- మే 16న మెడికల్ టూరిజంలో భాగంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్(గ్రూప్ 3) కంటెస్టెంట్స్ అపోలో, ఏఐజీ, యశోద హాస్పిటల్స్ సందర్శన
- మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే.
- మే 20, 21 తేదీల్లో టీ హబ్ వేదికగా కాంటినెంటల్ ఫినాలే.
- మే 22న శిల్పకళా వేదిక లో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే.
- మే 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో హెడ్ టు హెడ్ చాలెంజ్ ఫినాలే.
- మే 24న హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే. తెలంగాణ ఫ్యాషన్ డిజైనర్లతో ఇంటరాక్షన్.
- మే 25న హైటెక్స్ లో జ్యుయెలరీ, పెరల్ ఫ్యాషన్ షో.
- మే 31న హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే.