- పట్టణం చుట్టూ రూ.400 కోట్లతో రింగ్ రోడ్డు
- డీపీఆర్ రూపొందించేందుకు రూ.కోటి శాంక్షన్
- కొత్తగూడెం, పాల్వంచలో బైపాస్ రోడ్ల నిర్మాణాలకు ప్రపోజల్స్..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలుపుతూ చేపట్టనున్న రింగ్ రోడ్డుకు ఏర్పాట్లు స్పీడప్ అయ్యాయి. డీపీఆర్ రూపొందించేందుకు తాజాగా రూ.కోటి శాంక్షన్ చేశారు. ఈ మేరకు టెండర్లను పిలిచారు. మరోవైపు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు బైపాస్ రోడ్లను నిర్మించేందుకు ఆర్అండ్ బీ ఆఫీసర్లు ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు.
రూ. 400కోట్లతో..
కొత్తగూడెం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 400 కోట్ల మేరకు కేంద్రం నిధులు తీసుకువస్తున్నట్టు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్నారు. కొత్తగూడెం-, ఇల్లెందు రోడ్డులోని అనిశెట్టిపల్లి నుంచి హేమచంద్రాపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, రామవరం, దమ్మపేట రోడ్ మీదుగా పాల్వంచలోని పెద్దమ్మ తల్లి టెంపుల్వద్దకు దాదాపు 24కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణానికి నేషనల్ హైవే ఆఫీసర్లు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఖమ్మం టూ కొత్తగూడెం స్టేట్ హైవేకు రింగ్‌రోడ్డును అనుసందించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో పాల్వంచ టు భద్రాచలం మీదుగా జగదల్ పూర్‌కు వెళ్లే నేషనల్ హైవేకు రింగ్ రోడ్డు టచ్ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. వరంగల్ నుంచి మహబూబాబాద్, ఇల్లెందు నుంచి భద్రాచలం, మణుగూరు, జగదల్పూర్ వెళ్లే భారీ వెహికల్స్ రింగ్ రోడ్డు మీదుగా పాల్వంచ వెళ్లకుండా పట్టణ శివారులోని పెద్దమ్మ గుడి ప్రాంతం గుండా నేషనల్ హైవేకు కనెక్ట్ చేయనున్నారు. ఇందులో భాగంగానే డీపీఆర్ రూపొందించేందుకు ఎన్‌హెచ్ డిపార్ట్మెంట్ రెండు రోజుల కింద రూ. కోటి శాంక్షన్ చేసింది. దీనికి అధికారులు టెండర్లను కూడా పిలిచారు.
బైపాస్ రోడ్లతో ట్రాఫిక్ సమస్యకు చెక్..
కొత్తగూడెం, పాల్వంచ పట్టాణాల్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. కొత్తగూడెం పట్టణం గుండా భారీ వెహికల్స్ రాకపోకలను పోలీసులు పగలు నిషేధించారు. దీంతో భారీ వెహికల్స్‌ను డ్రైవర్లు పట్టణ సరిహద్దుల్లోనే పగలంతా నిలిపి ఉంచే పరిస్థితి నెలకొంది. సింగరేణితో పాటు కేటీపీఎస్, ఎన్టీపీసీ, ఐటీసీ, హెవీవాటర్ ప్లాంట్, బీటీపీఎస్ లాంటి పలు పరిశ్రమలకు నిత్యం భారీ వెహికల్స్ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో చుంచుపల్లి మండలం నుంచి పాల్వంచకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ప్లాన్ చేశారు.
చుంచుపల్లి బైపాస్ నుంచి కొత్తగూడెం పట్టణంలోని గోధుమ వాగు బ్రిడ్జి సమీపంలోని సీఎపీఎఫ్ ఆఫీస్ వరకు రోడ్డు నిర్మాణం కొనసాగింది. గోధుమ వాగుపై నేషనల్ హైవే బ్రిడ్జీలు ఉండడంతో, రైల్వే ట్రాక్ నేపథ్యంలో మరిన్ని నిధుల కోసం యత్నించే టైంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత బైపాస్ రోడ్డుపై పెద్దగా కదలిక లేకుండా పోయింది. తాజాగా ప్రస్తుత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బైపాస్ రోడ్ల నిర్మాణానికి నడుం బిగించారు. ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టారు.
ALSO READ : సన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్‌తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రాలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి బైపాస్ రోడ్ల ఆవశ్యకతను వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ప్రతిపాదనలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతిపాదనలు పంపాలని కొమటి రెడ్డి ఆర్అండ్బీ అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది. రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్ల నిర్మాణంతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు అభివృద్ధితోపాటు ట్రాఫిక్ సమస్య తీరనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.