అక్రమంగా అబార్షన్లు చేస్తున్న ముఠా అరెస్ట్

  • గుట్టుచప్పుడు కాకుండా​లింగ నిర్ధారణ పరీక్షలు

వరంగల్‍, వెలుగు: పుట్టబోయేది అమ్మాయో, అబ్బాయో చెప్పడమే కాకుండా.. ఆడపిల్ల వద్దనుకుంటే అబార్షన్‍ చేయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను మంగళవారం వరంగల్‍  కమిషనరేట్‍లోని హనుమకొండ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏసీపీ దేవేందర్‍రెడ్డి కథనం ప్రకారం.. బస్కె స్రవంతి హనుమకొండలోని ఓ హస్పిటల్​లో నర్సుగా పని చేస్తోంది. జంగా రాజమణి గర్భిణులను లింగ నిర్ధారణ కోసం స్రవంతి వద్దకు తీసుకువస్తుంది. వీరిద్దరూ కలిసి హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి సమీపంలో రహస్యంగా స్కానింగ్‍  సెంటర్‍  నడిపిస్తున్న కాసిరాజు దిలీప్‍  వద్ద లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

పుట్టబోయేది అమ్మాయి అని తెలిసి వద్దనుకునేవారికి.. వరంగల్‍ కాశీబుగ్గలో ప్రైవేట్‍  హస్పిటల్​లో ల్యాబ్‍  టెక్నీషియన్‍గా పని చేసే ఏకుల నరేశ్​ ద్వారా అబార్షన్లు చేపిస్తూ దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల కింద ఓ గర్భిణి రాజమణిని సంప్రదించగా.. స్రవంతి ద్వారా దిలీప్‍  స్కానింగ్‍  సెంటర్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆమె కడుపులో ఆడపిల్ల ఉందని చెప్పారు. ఇష్యూ అబార్షన్‍ వరకు వెళ్లింది. బాధిత మహిళకు నరేశ్​ టాబ్లెట్‍  కిట్‍  ద్వారా గర్భస్రావం చేసేందుకు ప్రయత్నించగా, తీవ్ర రక్తస్రావమై ఆరోగ్యం క్షీణించింది. దీంతో బాధిత మహిళను నగరంలోని ఓ హస్పిటల్​లో చేర్పించి అక్కడి నుంచి జారుకున్నారు. 

ట్రీట్‍మెంట్‍  అందించే క్రమంలో సదరు డాక్టర్‍  బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని.. డీఎంహెచ్‍వోకు సమాచారం అందించింది. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హనుమకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో అసలు నిందితులు బయటపడ్డారు. కాగా, నిందితురాలు స్రవంతి గతంలో పలుమార్లు ఇదే దందాలో పట్టుబడింది. నిందితులను రిమాండ్​కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఇన్స్​పెక్టర్​ సతీశ్​ టీమ్​ను అభినందించారు.