ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌‌రావు హత్య కేసులో నిందితుల అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌‌రావు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్​గడ్​లోని తమ సొంతూర్లకు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌‌లో బుధవారం నిందితుల వివరాలను వెల్లడించారు. మంగళవారం పోకలగూడెం ప్లాంటేషన్లను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తేజావత్ రామారావుతో కలిసి రేంజర్ శ్రీనివాస్‌‌ రావు పరిశీలించారు. ఆ టైమ్‌‌లో ఎర్రబోడు గొత్తికోయ గుంపునకు సమీపంలోని ప్లాంటేషన్‌‌లో కొందరు పశువులను మేపుతున్నట్టు వాచర్ రాములు వారికి ఫోన్ చేశారు. దీంతో రామారావుతో కలిసి శ్రీనివాస్‌‌ రావు అక్కడికి వచ్చారు. పశువులను మేపుతున్న మడకం తులా, పోడియం నంగాలను వెళ్లిపోవాలని చెప్పారు. 

పశువులు మేస్తుండగా, శ్రీనివాస్‌‌ రావు తన ఫోన్‌‌లో వీడియో తీస్తుండగా, గుత్తి కోయలకు కోపం వచ్చింది. మా వీడియోలే తీస్తావా..? అంటూ తులా, నంగా వేట కొడవళ్లతో రేంజర్‌‌పై దాడికి దిగారు. విచక్షణారహితంగా నరికారు. దీంతో భయపడిపోయిన సెక్షన్ ఆఫీసర్ రామారావు అక్కడి నుంచి పారిపోయి, విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాడు. తర్వాత వారు వచ్చి శ్రీనివాస్‌‌ రావును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. రామారావు ఫిర్యాదు మేరకు చండ్రుగొండ పీఎస్​లో కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం ఎర్రబోడు పరిసరాల్లో పోలీసులు విచారణ చేపట్టగా, నిందితులు తులా, నంగా చత్తీస్‌‌గఢ్‌‌ సుకుమా జిల్లాలోని సొంతూళ్లు పుల్వాగాడి, తిమ్మాపూర్‌‌‌‌కు పారిపోతున్నట్లు తెలుసుకున్నారు. వారిని సీతారామ కెనాల్ కట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. నేరం ఒప్పుకున్నారని, వారి నుంచి వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు.