గచ్చిబౌలి, వెలుగు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి శుక్రవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తాండూరులోని దర్గనపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ (23) రెండేండ్ల కిందట సిటీకి వచ్చి షేక్‌పేటలో ఉంటున్నాడు. అదే ఊరికి చెందిన అతడి ఫ్రెండ్ జనార్దన్ యాదవ్(25) ఐదేండ్ల కిందట సిటీకి వచ్చి చందానగర్‌లో ఉంటున్నాడు.
ప్రశాంత్ 2 నెలల కిందట జాబ్ మానేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మద్యానికి బానిసైన జనార్దన్‌కు సైతం జీతం డబ్బులు సరిపోకపోవడంతో ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్‌లకు స్కెచ్ వేశారు. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉండే యువతి ఆదిబట్లలోని టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. గత నెల 27న డ్యూటీ ముగించుకుని ఐఐఐటీ జంక్షన్ వద్ద బస్సు దిగింది. రాత్రి 9 గంటల టైమ్‌లో హాస్టల్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై ఆమెను ఫాలో అయిన ప్రశాంత్, జనార్దన్ యువతి మెడలోని 8 గ్రాముల గోల్డ్ చైన్‌ను లాక్కుని పారిపోయారు.
యువతి ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 4న ప్రశాంత్, జనార్దన్‌ను అదుపులోకి తీసుకుని 2 సెల్ ఫోన్లు, గోల్డ్ చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.