కాటారం, వెలుగు: గంజాయి సప్లై చేస్తుండగా, నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన మంగళవారం జరిగింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం కాటారానికి చెందిన మాడెం ప్రవీణ్, గంట పరిపూర్ణం, బయ్యారానికి చెందిన జగజంపుల విష్ణు, కొత్తపల్లికి చెందిన సొదారి సునీల్ అనే నలుగురు యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తూ, సేవిస్తుండేవారు. ఈ క్రమంలో బయ్యారం క్రాస్ వద్ద వారిని తనిఖీలు చేయగా, రూ.12వేల ఎండు గంజాయి దొరికినట్లు సీఐ తెలిపారు. అదుపులోకి తీసుకున్న యువకులను భూపాలపల్లి కోర్టులో హాజరుపర్చి, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..
ఏటూరునాగారం, వెలుగు: గుడుంబాను తరలిస్తున్న వ్యక్తిని ఏటూరునాగారం ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్టు చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై గుడుంబాను తరలిస్తున్న కమలాపురానికి చెందిన భూక్య లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకుని, పది లీటర్ల గుడుంబా, హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.