Bangladesh Cricket: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌పై అరెస్ట్ వారెంట్

Bangladesh Cricket: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌పై అరెస్ట్ వారెంట్

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్‌(Shakib Al Hasan)కు కష్టకాలం నడుస్తోంది. బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉండటంతో దేశ, విదేశీ  లీగుల్లో బౌలింగ్‌ చేయకుండా నిషేధం ఎదురుకొంటున్నాడు. ఈ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ బాధలో ఉన్న అతనికి మరొక సమస్య వచ్చి మీద పడింది. చెక్ బౌన్స్ కేసులో ఢాకా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

రూ.3 కోట్లు..!

తమ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కామర్స్ (IFIC)బ్యాంక్ షకీబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిచ్చిన చెక్‌లు బౌన్స్ అయినట్లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు కావాలని అతనికి పలు సమన్లు జారీ చేసినప్పటికీ, స్పందించలేదు. ఈ క్రమంలోనే అతనిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షకీబ్‌తో పాటు మరో వ్యక్తిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.

ALSO READ | జొకోవిచ్‌‌ X అల్కరాజ్‌‌.. ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశం

షకీబ్.. ఎఫ్‌ఐసి బ్యాంక్‌కు 41.4 మిలియన్ టాకా (భారత కరెన్సీలో సుమారు 3 కోట్లు) చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో స్థిరపడ్డ షకీబ్

విద్యార్థుల ఆందోళనలతో షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక షకీబ్ బంగ్లాదేశ్ వెళ్లటమే మానేశాడు. హసీనా ప్రభుత్వంలో ఎంపీ కనుక స్వదేశానికి వెళ్తే ఎక్కడ అదుపులోకి తీసుకుంటారో అన్న భయంతో అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అతడు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ.