లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్య చిక్కుల్లో పడ్డారు. 2014లో చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి సుల్తాన్ పూర్ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. 2014లో స్వామి ప్రసాద్ మౌర్య హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. నిన్న ఆ కేసు విచారణ ఉండగా.. మౌర్య దానికి హాజరుకాలేదు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు న్యాయమూర్తి స్వామి ప్రసాద్ మౌర్యకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వాస్తవానికి 2016లోనే కోర్టు స్వామి ప్రసాద్ మౌర్య అరెస్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హైకోర్టు ఆశ్రయించిన ఆయన దానిపై స్టే తెచ్చుకున్నారు. తాజాగా జనవరి 6న జరిగిన విచారణకు ఆయన డుమ్మా కొట్టడంతో జనవరి 12న మౌర్య తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. కానీ ఆయన ఆ ఆదేశాలను బేఖాతరు చేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఇదిలా ఉంటే యూపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మంగళవారం నాడు యోగి కేబినెట్లో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. మౌర్య పార్టీని వీడిన వెంటనే మరికొందరు బీజేపీ నేతలు ఆయన బాట పట్టారు. మరో మంత్రి సహా ఆరుగురు నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు.