- బెంగళూరులో పట్టుకున్న పోలీసులు
- ఇప్పటివరకు 13 మంది అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం కేసులో క్యూనెట్ నిర్వాహకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ నిర్వాహకులు పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో క్యూనెట్ నెట్‌వర్క్‌లోని వి–ఎంపైర్ లో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది చనిపోయారు. ఈ క్రమంలో క్యూ నెట్ నిర్వాహకుల మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఏపీలోని కర్నూల్ జిల్లా చెప్పంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ఉపేంద్రనాథ రెడ్డి (32) ని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
బెంగళూరులోని బనస్‌వాడిలో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. కాగా, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్యూనెట్ పేరుతో దేశవ్యాప్తంగా మల్టీలెవెల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నది. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ‘వి–ఎంపైర్’ పేరుతో బోగస్ కంపెనీ ఏర్పాటు చేసింది. వి ఎంపైర్ ఆఫీసులో ఉపేంద్రనాథ రెడ్డి, బెంగళూరుకు చెందిన రాజేశ్ కన్నా ప్రమోటర్లుగా బాధ్యతలు నిర్వహించారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నిరుద్యోగ యువతను ట్రాప్ చేశారు. ఈ కామర్స్ బిజినెస్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్, సేల్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు రిటర్న్స్ ఇస్తామని యువతను నమ్మించారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు,సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.50 వేల నుంచి రూ 1.5 లక్షలు వసూలు చేశారు.
163 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు
క్యూనెట్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మెంబర్స్‌ను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల యువతను కమీషన్లతో ఆకట్టుకున్నారు. నెలకు రిటర్న్స్ ఇస్తామంటూ దాదాపు 163 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది మార్చి 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులోని క్యూ నెట్ వి ఎంపైర్‌లో పనిచేస్తున్న యువతీ యువకులు మంటల్లో చిక్కుకుని ఆరుగురు చనిపోయారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు 3కేసులు నమోదు చేసి సీసీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. సీసీఎస్ పోలీసులు ఇప్పటికే 12 మంది క్యూనెట్ నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులకు సంబంధించి 35 బ్యాంకు ఖాతాలను గుర్తించి రూ.54 కోట్లు ఫ్రీజ్ చేశారు.