తెలంగాణ RTCలో ఎలక్ర్టిక్‍ బస్సులు ?

  • ఓరుగల్లుకు 2019 నుంచి ఊరిస్తున్న కరెంట్‍ బస్సులు
  • ఫేమ్‍ ఇండియా స్కీంలో 25 ఎలక్ర్టిక్‍ బస్సులు మంజూరు
  • గత ప్రభుత్వ అశ్రద్ధతో వెనక్కు వెళ్లిన బస్సులు
  • ప్రపోజల్స్​వద్దనే ఆగుతున్న కేటాయింపులు

వరంగల్‍, వెలుగు :  ఓరుగల్లుకు ఎలక్ట్రిక్‍ బస్సుల రాక కలగానే మిగులుతోంది. వరంగల్‍ రీజియన్‍కు నేడోరేపో కరెంట్​బస్సులు వస్తున్నాయంటూ ఏండ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఐదేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‍తోపాటు వరంగల్‍ రీజియన్‍కు సైతం ఎలక్ట్రిక్‍ బస్సులు కేటాయించినా, నాటి కేసీఆర్‍ ప్రభుత్వం కావాల్సిన ఫార్మాలిటీస్‍ పూర్తి చేయకపోవడంతో అవి వెనక్కువెళ్లాయి.

'ఫేం ఇండియా స్కీం'లో 25  బస్సులు.. 

పొల్యూషన్‍ కంట్రోల్‍ చేయాలనే ఉద్దేశంతో 2030 నాటికి దేశంలో 80 శాతం ఎలక్ర్టికల్‌ బస్సులు తీసుకురావాలని కేంద్ర రోడ్డు, రవాణా సంస్థ భావించింది. దీనికోసం 'ఫేం ఇండియా స్కీం' తీసుకొచ్చింది. పలు రాష్ట్రాలకు రెంటల్‍ సిస్టంలో వందలాది ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చేందుకు రెడీ అయింది. తెలంగాణలో అప్పటికే 10 వేలకు పైగా డీజిల్​బస్సులు ఉండగా, క్రమక్రమంగా వాటిని తగ్గించే ప్రయత్నం చేసింది. రాష్ట్రానికి 2018లో రూ.కోటి, 2019లో రూ.50 లక్షల సబ్సిడీ ఇచ్చింది. టీఎస్ఆర్టీసీకి మొదట 325 వెహికల్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇందులో 300 హైదరాబాద్‍కు కేటాయించగా, మరో 25 వరంగల్‍ సిటీకి మంజూరు చేసింది.

పట్టించుకోక వెనక్కు..

వరంగల్ సిటీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైన విషయాన్ని 2019 సెప్టెంబర్‍లో టీజీ ఆర్టీసీ పెద్దాఫీసర్లు కన్ఫార్మ్​​చేశారు. సంస్థ తరఫున టెండర్ల నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టామని, ఓరుగల్లుకు ఇక ఎలక్ట్రికల్‍ బస్సులు పరిచయం చేసినట్లేనని తెలిపారు. ఇది చెప్పాక ఏడాదిన్నర తర్వాత ఆర్టీసీ కరీంనగర్‍, హైదరాబాద్‍ జోన్‍ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‍టీ.వి.మునిశేఖర్‍ వరంగల్‍ పర్యటనకు వచ్చారు.

 'ఫేమ్ ఇండియా స్కీం' లో వరంగల్‍కు రావాల్సిన 25 బస్సులు క్యాన్సెల్‍ అయినట్లు తెలిపారు. సమ్మె కారణంగా గడువు ముగిసే సమయానికి టీజీ ‍ఆర్టీసీ కావాల్సిన ఫార్మాలిటీస్‍ పూర్తి చేయలేకపోయిందని చెప్పారు. కాగా, 'సమ్మెలో సిబ్బంది తప్పితే పెద్దాఫీసర్లు లేరు కదా' అని ప్రశ్నిస్తే, సంబంధిత శాఖ నుంచి ఈ విషయమై తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదనే సమాధానం ఇచ్చారు. మొత్తంగా ఐదేండ్ల క్రితమే గ్రేటర్‍ వరంగల్‍ సిటీకి రావాల్సిన ఎలక్ట్రిక్‍ బస్సులు  ఇప్పటి వరకు రాలేదు. 

కరీంనగర్‍ రోడ్లపైకి ఎలక్ట్రిక్‍ బస్సులు..

ప్రస్తుతం టీజీ ఆర్టీసీ టీజీ ఆర్టీసీగా మారాక కరీంనగర్‍ రీజియన్‍కు 70 ఎలక్ర్టిక్‍ బస్సులను మంజూరు చేసింది. దీంతో రేపోమాపో ఇక్కడి రోడ్లపై పరుగులు తీసేందుకు బస్సులు రెడీ అయ్యాయి. మొదట 33 బస్సులు కరీంగనగర్‍ నుంచి హైదరాబాద్‍ నడిపేలా ఏర్పాట్లు చేశారు. జేబీఎం కంపెనీ తయారు చేసిన ఈ బస్సుల్లో 41 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది.

 కాగా, డీజిల్‍ ఖర్చు లేకుండా కరెంట్‍ ద్వారా బ్యాటరీ ఛార్జ్​ చేసేందుకు రూ.6 కోట్లతో కరీంనగర్‍ 2 డిపోలో ఛార్జింగ్‍ స్టేషన్‍ ఏర్పాటు చేసి 14 ఛార్జింగ్‍ పాయింట్లను రెడీ చేయడం చివరి దశలో ఉంది. 3 గంటల పాటు ఛార్జీ చేస్తే దాదాపు 370 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, టీజీఆర్టీసీ అధికారులు రెండో రాజధాని వరంగల్‍ సిటీకి సైతం ఎలక్ట్రిక్‍ బస్సులు కేటాయించేలా చొరవ తీసుకోవాలని గ్రేటర్‍ వరంగల్‍వాసులు కోరుతున్నారు.