
జైపూర్/చెన్నూరు/బెల్లంపల్లి రూరల్/జన్నారం, వెలుగు: మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరికతో చెన్నూర్ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరడం ఖాయమని జైపూర్ మండల పార్టీ ఇన్చార్జి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడాన్ని స్వాగతిస్తూ నేతలు చెన్నూర్, జైపూర్ తదితర ప్రాంతాల్లో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వివేక్ కాంగ్రెస్‌లో చేరికతో చెన్నూర్ నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపారని అన్నారు.
వైస్ఎస్ఆర్ టీపీ మండల ప్రెసిడెంట్ సాయి కుమార్ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. మండల వైస్ ప్రెసిడెంట్ రమేష్ , జనరల్ సెక్రెటరీ తిరుపతి ఇతర లీడర్లు పాల్గొన్నారు. బీజేపీ భీమారం మండల ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటులో వివేక్ వెంకటస్వామి కృషి మరువలేదని, తామంతా ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. లీడర్లు చల్లా రాజిరెడ్డి, కామెర రాములు, తైనేని రవి, అలకాటి తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు. వివేక్ కాంగ్రెస్‌లో చేరడంపై హర్షం వ్యక్తం చేస్తూ చెన్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి పటాకులు పేల్చారు. నాయకులు శ్రీధర్, రఘునందన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మధు, కన్వర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జన్నారం మండల వైస్‌ప్రెసిడెంట్ బత్తిని నాగన్న గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. కాసీపేట మండల కేంద్రంలో పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. నాయకులు రత్నం ప్రదీప్, మైదం రమేశ్, గోలేటీ స్వామి, గుండా రాజ్ కుమార్, జాడి శివ తదితరులు పాల్గొన్నారు.