Paris Olympics 2024: నీరజ్ కూడా నా బిడ్డే: పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తల్లి

ఒలింపిక్స్  జావెలిన్‌ త్రో లో ఆసియా దేశాలు సత్తా చాటాయి. పాకిస్థాన్, భారత్ కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ లభించాయి. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం సాధిస్తే.. భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. సాధారణంగా పాకిస్థాన్ పై భారత్ ఓడిపోతే అభిమానులు జీర్ణించుకోలేరు. కానీ ఒలింపిక్స్ లో కి వచ్చేసరికి సీన్ మారిపోయింది. రెండు దేశాలు ఇద్దరినీ  అభిమానిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నీరజ్ తల్లి అర్షద్ ను అభినందిస్తూ అందరూ అథ్లెట్లు తమ బిడ్డలు అని భావిస్తే.. తాజాగా నీరజ్ చోప్రా కూడా తన బిడ్డే అని అర్షద్ తల్లి చెప్పుకొచ్చింది. 

నీరజ్ కూడా నా కొడుకు లాంటి వాడు. అతను నదీమ్ స్నేహితుడు.. సోదరుడు కూడా. గెలుపు ఓటములు క్రీడలో భాగం. అతడిని దేవుడు ఆశీర్వదించాలి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ గెలవాలి. వారిద్దరూ సోదరులు లాంటివారు. నేను కూడా నీరజ్ గెలవాలని ప్రార్థించాను." అని అర్షద్ తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "నా కొడుకు అర్షద్ పై మద్దతు తెలిపినందుకు పాకిస్థాన్ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరి ప్రార్ధనలు ఫలించాయి". ఆమె చెప్పుకొచ్చింది.      

అతనూ మన బిడ్డే..
 
అంతకుముందు నీరజ్ తల్లి సరోజ్ దేవి.. పాకిస్థాన్ అథ్లెట్ ఆర్షద్ నదీమ్ పై ఇలానే స్పందించారు. అతను కూడా మన బిడ్డే అని వ్యాఖ్యానించారు.

"ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ విజయం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అర్షద్ కూడా మన బిడ్డ లాంటి వాడు. ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆసియాలో ఇరుగు పొరుగు దేశాలు అయిన భారత్, పాకిస్థాన్.. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాయి. ఇది మనందరికీ గర్వకారణం.." అని నీరజ్ తల్లి సరోజ్ దేవి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గురువారం (ఆగస్ట్) అర్ధ రాత్రి   జరిగిన ఫైనల్లో అర్షద్ ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్‌ విసరగా.. నీరజ్‌ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు.  దీంతో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కు గోల్డ్ మెడల్.. భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ లభించాయి.