- ఒక్క ఓటు తేడాతో గెలుపు..
- మూడు ప్యానెళ్లకు రెండేసి పోస్టులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నూతన ప్రెసిడెంట్‌గా అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. క్రికెట్, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తూ శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోలింగ్‌లో జగన్ ఒక్క ఓటు తేడాతో తన సమీప ప్రత్యర్థి అమర్‌నాథ్‌పై గెలుపొందారు. యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జగన్‌కు 63 ఓట్లు రాగా.. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ అభ్యర్థి అమర్‌నాథ్‌కు 62 వచ్చాయి. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్న జగన్ హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ పడ్డ తొలి ప్రయత్నంలోనే కీలకమైన ప్రెసిడెంట్ పోస్టును కైవసం చేసుకున్నారు.
ఆయన ప్యానెల్ నుంచి ట్రెజరర్‌గా సీజే శ్రీనివాస్ రావు (64 ఓట్లు) గెలిచారు. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి దల్జీత్ సింగ్ (63 ఓట్లు) వైస్ ప్రెసిడెంట్‌గా, బసవరాజు (61 ఓట్లు) జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ నుంచి పోటీ చేసి సెక్రటరీగా ఆర్. దేవరాజ్(77 ఓట్లు), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (59 ఓట్లు) గెలిచారు. కొత్త కార్యవర్గం మూడేళ్ల పాటు పదవిలో ఉంటుంది.
మిశ్రమ ఫలితాలు
పోలింగ్‌లో మొత్తం 173 ఓటర్లకు గాను 169 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కౌంటింగ్ మాత్రం ఉత్కంఠగా సాగింది. గత పర్యాయం అన్ని పోస్టులను ఒకే ప్యానెల్ గెలవగా ఈసారి మిశ్రమం ఫలితం వచ్చింది. నాలుగు ప్యానెళ్లు పోటీ ఉండగా ఓటర్లు మూడు ప్యానెళ్లకు రెండేసి పోస్టులు కట్టబెట్టారు. హానెస్ట్ హార్డ్ వర్కింగ్ ప్యానెల్ ఒక్క పోస్టు కూడా నెగ్గలేకపోయింది. ప్రెసిడెంట్‌తో పాటు జాయింట్ సెక్రటరీ పోస్టు ఫలితం ఉత్కంఠ రేపింది. రెండు ఓట్ల తేడాతో గెలిచిన బసవరాజుకు 61 ఓట్లు రాగా, చిట్టి శ్రీధర్(క్రికెట్ ఫస్ట్)కు 59 ఓట్లు వచ్చాయి. మిగతా నాలుగు పోస్టులు స్పష్టమైన మెజారిటీతోనే తేలాయి.
‘నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన హెచ్‌సీఏ మెంబర్లకు థ్యాంక్స్. ఇది తెలంగాణ విజయం. హెచ్‌సీఏ తెలంగాణ ప్రజలది అని నిరూపించా. మేం అన్ని పోస్టులు నెగ్గకున్నా మిగతా ఆఫీస్ బేరర్లను కలుపుకొని ముందుకెళ్తాం. హెచ్‌సీఏను దేశంలోనే నంబర్ వన్ క్రికెట్ అసోసియేషన్‌గా తీర్చిదిద్దుతాం’.
- జగన్ మోహన్