హైదరాబాద్, వెలుగు : నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ క్రీడాకారులకు సపోర్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ అర్శనపల్లి జగన్‌మోహన్ రావు కోరారు. ఆదివారం కూకట్‌పల్లిలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో పాల్గొన్న జగన్ స్టార్ షూటర్, ఆసియా గేమ్స్ మెడలిస్ట్ ఇషాసింగ్కు అక్షర సంస్థల తరఫున రూ.1 లక్ష నగదు బహుమతి అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదన్నారు. అయితే, వారికి సరైన దిశానిర్దేశం చేయడంతో పాటు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్, ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి త్వరలో మేధావులు, నిపుణలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.