- తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు
హైదరాబాద్, వెలుగు : జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంలోని వివాదాలను ముగించడంలో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ)ను జాతీయ క్రీడా సంఘంగా గుర్తిస్తూ కేంద్ర క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఏఐ అధ్యక్షుడిగా దిగ్విజయ్ చౌతాలా, ప్రధాన కార్యదర్శిగా జగన్‌మోహన్‌రావు, కోశాధికారిగా తేజ్‌రాజ్ సింగ్ ఎన్నికను ధ్రువీకరించింది. దాంతో, దేశంలో హ్యాండ్‌బాల్ కార్యకలాపాలను ఇక నుంచి పూర్తిగా హెచ్ఏఐనే నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయిందని జగన్ మోహన్ రావు తెలిపారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి హెచ్ఏఐకు గుర్తింపు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
హెచ్‌ఏఐపై విశ్వాసం ఉంచిన రాష్ట్ర సంఘాలకు, ప్లేయర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖలు, ఐహెచ్ఎఫ్, ఏహెచ్ఎఫ్, ఐఓఏ సపోర్ట్‌తో దేశంలో హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్ తీసుకొస్తామని చెప్పారు. దేశంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి త్వరలో బ్లూప్రింట్ సిద్ధం చేస్తామని తెలిపారు. వచ్చే నేషనల్ గేమ్స్‌లో తిరిగి హ్యాండ్‌బాల్‌ను ప్రవేశపెడతామన్నారు. గత నెలలో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)ను విజయవంతంగా నిర్వహించామని, ఫ్యూచర్‌లో మహిళల హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణకూ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.