Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ శనివారం(జనవరి 18) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సిరాజ్‌ను తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 

తుస్సుమంటున్న సిరాజ్..

ఈమధ్య కాలంలో సిరాజ్ ప్రదర్శన అంతంత మాత్రమే. అడపాదడపా రాణిస్తున్నా.. జట్టులో నమ్మకమైన బౌలర్‌గా పేరు తెచ్చుకోలేకపోతున్నారుడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ .. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలోనూ రెండింటా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించారని టాక్. 

ALSO READ | Champions Trophy 2025: ఇక ఐపీఎల్ ఆడుకోవాల్సిందే.. భారత జట్టు నుంచి సిరాజ్ ఔట్

అయితే, రోహిత్ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించలేదు. అతని స్థానంలో కొత్త బంతితో, డెత్‌ ఓవర్లలో బౌలింగ్ చేయగల పేసర్‌ను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో సిరాజ్ కంటే అర్ష్‌దీప్ సింగ్ ముందున్నాడని.. అందువల్లే జట్టులో చోటు కల్పించామని వివరించాడు. అంతేకాదు, జట్టులో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్లు పేర్కొన్నాడు. 

అర్ష్‌దీప్‪కే అందరి మద్దతు..

జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించడాన్ని ఎవరూ విమర్శించడం లేదు. అందుకు కారణం.. ఇటీవల మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన. గత రెండు నెలలుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్న అర్ష్‌దీప్ ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి చోటు కల్పించారు. 

మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ముగ్గురు పేసర్లతో వెళ్తోంది. వెన్నునొప్పి గాయం కారణంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ నుంచి వైదొలిగిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అలాగే, వన్డే ప్రపంచ కప్ అనంతరం జట్టుకు దూరమైన మరో భారత పేసర్ మహ్మద్ షమీ జట్టులో చోటు సంపాదించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.