IND vs ENG: చాహల్ రికార్డ్ బద్దలు.. టీమిండియా టాప్ బౌలర్‌గా అర్షదీప్ సింగ్

IND vs ENG: చాహల్ రికార్డ్ బద్దలు.. టీమిండియా టాప్ బౌలర్‌గా అర్షదీప్ సింగ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ ఓపెనర్లకు చుక్కలు చూపించాడు. బెన్ డకెట్, పిల్ సాల్ట్ లను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో భారత టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.  లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్న రికార్డును అర్షదీప్ బ్రేక్ చేయడం విశేషం. మొత్తం 97 వికెట్లతో అర్షదీప్ టీ20 క్రికెట్ లో భారత తరపున టాప్ బౌలర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ 90, జస్ప్రీత్ బుమ్రా 89 వికెట్లు పడగొట్టి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

Also Read :- ఇంగ్లాండ్ దిగ్గజం ఎంపిక చేసిన ఫ్యూచర్ ఫ్యాబ్-4 వీరే

టాస్ గెలిచి ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇన్నింగ్స్ మూడో బంతిని అర్షదీప్ సింగ్ సాల్ట్ ను ఔట్ చేసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. అర్షదీప్ తన రెండో ఓవర్లో డకెట్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అర్షదీప్ మరో మూడు వికెట్లు పడగొడితే 100 వికెట్ల క్లబ్ లోకి చేరతాడు. అదే జరిగితే టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్ గా 164 వికెట్లతో న్యూజి లాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టాప్ లో ఉన్నాడు. 

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

1) అర్ష్‌దీప్ సింగ్ - 97

2) యుజ్వేంద్ర చాహల్ - 96

3) భువనేశ్వర్ కుమార్ - 90

4) జస్ప్రీత్ బుమ్రా - 89