IND vs ENG: అగ్ర స్థానానికి చేరువలో అర్షదీప్.. తొలి టీ20 ముందు ఊరిస్తున్న రెండు రికార్డులు

IND vs ENG: అగ్ర స్థానానికి చేరువలో అర్షదీప్.. తొలి టీ20 ముందు ఊరిస్తున్న రెండు రికార్డులు

భారత టీ20 క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ వేగంగా దూసుకొస్తున్నాడు. భారత టీ20 తుది జట్టులో ఖచ్చితంగా ఉండే అర్షదీప్.. కెరీర్ ప్రారంభం నుంచి అత్యంత నిలకడ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టర్మ్ పేసర్.. చూస్తూ ఉండగానే టీ20 క్రికెట్ లో భారత టాప్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను దాటేశాడు. టీ20 క్రికెట్ లో 95 వికెట్లు తీసి బుమ్రా, భువీలను వెనక్కి నెట్టాడు. దీంతో టీ20 క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు.

అగ్ర స్థానానికి చేరువలో అర్షదీప్: 
 
ఇప్పటివరకు భారత్ తరపున 60 టీ20 మ్యాచ్ లాడిన అర్షదీప్ సింగ్ 8.32 ఎకానమీతో 95 వికెట్లు పడగొట్టాడు. నేడు ఇంగ్లాండ్ తో జరగనున్న తొలి టీ20లో రెండు వికెట్లు తీస్తే టీమిండియా తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. అర్షదీప్ రెండో స్థానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్ 90, జస్ప్రీత్ బుమ్రా 89 వికెట్లు పడగొట్టి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

Also Read :- మూడేళ్ళ తర్వాత క్రికెట్‌లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ

స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 ఈ సిరీస్ లో మరో 5 వికెట్లు పడగొడితే 100 వికెట్ల క్లబ్ లోకి చేరతాడు. అదే జరిగితే టీ20 ఫార్మాట్ లో భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్ గా 164 వికెట్లతో న్యూజి లాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టాప్ లో ఉన్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు (జనవరి 22) కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 జరగనుంది. 
 
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

1) యుజ్వేంద్ర చాహల్ - 96

2) అర్ష్‌దీప్ సింగ్ - 92

3) భువనేశ్వర్ కుమార్ - 90

4) జస్ప్రీత్ బుమ్రా - 89